Rishabh Pant : భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant ) టీ20 వరల్డ్ కప్‌లో దుమ్మురేపుతున్నాడు. ఆకలిగొన్న పులిలా అటాకింగ్ గేమ్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. మూడో స్థానంలో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న పంత్ టీమిండియాకు కొండంత భరోసానిస్తున్నాడు. అయితే.. క్రికెట్ పిచ్‌పై పంత్ విన్యాసాలను ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) తాజాగా యోగాసనాలతో పోల్చుతూ ఓ పోస్ట్ పెట్టింది. ఇంకేముంది క్షణాల్లో ఆ పోస్ట్ వైరల్ అయింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లక్నో ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో పంత్ వరల్డ్ కప్ ఇన్నింగ్స్‌లకు సంబంధించిన పలు ఫొటోలను షేర్ చేసింది. దానికి ‘మన ఫేవరెట్ యోగా పోజ్.. పంతాసనా’ అని క్యాప్షన్ రాసింది. ఆ ఫొటోలు చూసిన వాళ్లంతా.. దంచికొట్టే క్రమంలో పంత్
బ్యాలెన్స్ తప్పి కిందపడడం, ఒంటికాలిపై, మోకాలుపై కూర్చొని బౌండరీలు బాదడం భలేగుందని అనుకుంటున్నారు.
Our favourite yoga pose – Pantasana 😅#InternationalDayOfYoga pic.twitter.com/4Y2DHuqpTV
— Lucknow Super Giants (@LucknowIPL) June 21, 2024
ఐపీఎల్ 14వ సీజన్‌తో పునరాగమనం చేసిన పంత్ ధనాధన్ బ్యాటింగ్‌తో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌లోకి వచ్చాడు. సంజూ శాంసన్(Sanju Samson) నుంచి పోటీ ఎదురైనా సరే కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ లెఫ్ట్ హ్యాండర్ నిలబెట్టుకున్నాడు. అమెరికాపై, పాకిస్థాన్‌పై టాపార్డర్ తడబడినా ‘నేనున్నాగా’ అంటూ పంత్ వీరవిహారం చేశాడు. ఇక సూపర్ 8లో అఫ్గనిస్థాన్‌పై కూడా అతడు తనమార్క్ షాట్లతో అలరించాడు. మొత్తంగా వరల్డ్ కప్‌లో పంత్ 4 ఇన్నింగ్స్‌ల్లో 116 రన్స్ స్కోర్ చేశాడు. అంతేకాదు కీపర్‌గానూ అద్భుతంగా రాణిస్తు జట్టులో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.