Indus Appstore | మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తున్నారా.. అయితే, అందులో గూగుల్ ప్లే స్టోర్ బదులు దేశీయంగా అభివృద్ధి చేసిన యాప్ స్టోర్.. ‘ఇండస్ యాప్ స్టోర్ (Indus App Store) ప్రీ ఇన్ స్టల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలను తమ స్మార్ట్ ఫోన్లలో ‘ఇండస్ యాప్ స్టోర్ (Indus App Store)’ ప్రీ-ఇన్‌స్టల్ చేసుకోవాలని ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఏడాది చివరికల్లా 150 మిలియన్ల యూజర్లను చేర్చుకోవాలని ఇండస్ యాప్ స్టోర్ లక్ష్యంగా పెట్టుకుందని సంస్థ కో-ఫౌండర్ ఆకాశ్ డోంగ్రే తెలిపారు. నొకియా, లావా సంస్థలతో పార్టనర్ షిప్ ఒప్పందాలు చేసుకోగా, పలు ప్రధాన స్మార్ట్ ఫోన్ సంస్థలతో ఇండస్ యాప్ స్టోర్ యాజమాన్యం సంప్రదింపులు సానుకూల దశలో ఉన్నాయన్నారు.
ఇప్పటికే గూగుల్, యాప్ డెవలపర్ల మధ్య బిల్లింగ్ పాలసీలు, కమిషన్ల విషయంలో విభేదాలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ప్రారంభంలోనే గూగుల్ ప్లే స్టోర్‌కు ఆల్టర్నేటివ్గా సొంతంగా ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ స్టోర్ ‘ఇండస్ యాప్ స్టోర్’ ప్రారంభించింది. ఇండస్ యాప్ స్టోర్’లో బ్లింకిట్, మేక్ మై ట్రిప్, పేటీఎంతోపాటు డ్రీమ్ 11, నాజారా టెక్నాలజీస్, ఏ23, ఎంపీఎల్, జంగిల్ రమ్మీ, తాజ్ రమ్మీ, రమ్మీ పాషన్, రమ్మీ కల్చర్, రమ్మీ టైం, కార్డ్ బాజీ వంటి ప్రముఖ గేమింగ్ కంపెనీ యాప్స్ .. ఇండస్ యాప్ స్టోర్’లో ఆన్ బోర్డ్ యాప్స్ గా ఉన్నాయి.
మరోవైపు దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో రెండు మిలియన్ల మంది యూజర్లు ఇండస్ యాప్ స్టోర్ డౌన్ లోడ్ చేసుకున్నారు. దీని యూజర్ బేస్’లో 45 శాతం వీరే. ఇండస్ యాప్ స్టోర్’లో 2.50 లక్షలకు పైగా యాప్స్ ఉన్నాయని ఆకాశ్ డోంగ్రే చెప్పారు. తొలి ఏడాది లిస్టింగ్ ఫీజు, ప్లాట్ ఫామ్ ఫీజు మాఫీ చేశారు. ఇన్ యాప్ ట్రాన్సాక్షన్లను తొలగించారు. 12 భారత్ భాషలకు యాప్ స్టోర్ మద్దతుగా నిలుస్తుంది. ఫోన్‌పే సాయంతో సుస్థిర చెల్లింపు వ్యాపార విధానాన్ని రూపొందిస్తామని ఆకాశ్ డోంగ్రీ చెప్పారు. ప్రారంభించిన మూడు రోజుల్లోనే యాప్ స్టోర్ లక్ష డౌన్ లోడ్లను దాటేసింది.