Actor Suriya | తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి (Kallakurichi) జిల్లాలో కల్తీ మద్యం (Spurious liquor) కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కల్తీ మద్యం తాగి ఇప్పటివరకు 47 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 100 మంది ఆసుపత్రిపాలయ్యారు. ఇక అస్వస్థతకు గురైన వారు కళ్లకురిచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ ఘటనకు ప్రభుత్వ అధికారుల వైఫల్యంతో పాటు, పోలీసుల నిర్లక్ష్యమే కారణమని వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక కార్యకర్తలు, నటీనటులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే ఈ ఘటనపై సినీ నటులు కమల్ హాసన్, విశాల్‌తో పాటు తమిళ దర్శకుడు పా. రంజిత్ ఎక్స్ వేదికగా స్పందించారు. కమల్ స్పందిస్తూ.. కల్తీ మద్యం వార్త తమిళనాడును దిగ్భ్రాంతికి గురిచేసింది. కల్తీ మద్యం వ్యాపారులపై తమిళనాడు ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి, తద్వారా తమిళనాడులో ఇలాంటి దుర్ఘటన మళ్లీ జరగకుండా చూడాలి అంటూ ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు. పా. రంజిత్ మాట్లాడుతూ.. కల్లకురిచ్చి మరణాలు తీవ్ర దిగ్భ్రాంతిని, బాధను కలిగించాయని, తమిళనాడు ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యమే ఈ దారుణానికి కారణమని విమర్శించారు. ఇదిలావుంటే తాజాగా ఈ ఘటనపై నటుడు సూర్య స్పందించారు.
కల్లకురిచ్చి మరణాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. తుఫానులు, వరదలు వంటి విపత్తుల సమయంలో కూడా జరగని విషాదం ఒక్క కల్తీ మద్యంతో జరిగింది. ఈ ఘటనలో వంద మందికి పైగా ఇంకా ఆసుపత్రిలో ఉండటం ఆందోళనకరం. ప్రభుత్వం సత్వరమే స్పందించి భాదితులకు అండగా ఉండాలి. గతేడాది విల్లుపురం జిల్లాలో కల్తీ మద్యం తాగి 22 మంది చనిపోయారు. అప్పుడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కానీ ఆ ఘటన జరిగిన పక్క జిల్లాలోనే ఇప్పుడు 50కి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి కల్తీ మద్యం వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలి అంటూ రాసుకోచ్చాడు.
இனி ஒரு விதி செய்வோம்..! அதை எந்நாளும் காப்போம்..! #Kallakkurichi pic.twitter.com/z3lTZLtdYs
— Suriya Sivakumar (@Suriya_offl) June 21, 2024