రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులకు పూనకాలు తెప్పించిన ఐపీఎల్ 19వ సీజన్ మహా సంగ్రామం ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది.
ఒకవైపు ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్న డిఫెండింగ్ చాంప్ బెంగళూరు .. మరోవైపు పక్కా ప్లానింగ్‌తో సైలెంట్‌గా దెబ్బకొడుతున్న గుజరాత్ఫైనల్ పంచ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి.
అహ్మదాబాద్‌లోని మెగా క్రికెట్ స్టేడియం ఈ బ్లాక్‌బస్టర్ ఫైట్‌కు వేదిక కానుంది. ఢీ అంటే ఢీ అంటున్న రెండు జట్ల మధ్య జరిగే అసలు సిసలైన ఆఖరాటలో.. రెండోసారి ఐపీఎల్ కిరీటాన్ని ముద్దాడేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది!
అహ్మదాబాద్: నీరు-నిప్పు లాంటి భిన్న జట్ల మధ్య ఐపీఎల్ తుది పోరుకు వేదిక సిద్ధమైంది. టోర్నీ అంతటా భీకర దూకుడుతో ప్రత్యర్థులను భయపెట్టిన బెంగళూరు.. ప్రశాంతంగా, పక్కా ప్రణాళికలతో సాగిన గుజరాత్‌తో ఆదివారం ఇక్కడి నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో తలపడనుంది. 17 ఏండ్ల పోరాటం తర్వాత గతేడాది నెగ్గిన ట్రోఫీని నిలబెట్టుకోవాలని ఆర్సీబీ పట్టుదలతో ఉండగా, 2022 విన్నర్ గుజరాత్ ఆ జట్టుకు బ్రేకులు వేయాలని చూస్తోంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం ఆర్సీబీనే అందరి దృష్టిలో హాట్ ఫేవరెట్. వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సరసన చేరాలని రజత్ పాటిదార్ నాయకత్వంలోని ఆర్సీబీ టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ, శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని జీటీని అంత తేలిగ్గా తీసిపారేయలేం. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలోనే చిత్తయినా.. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌పై అద్భుత విజయంతో ఫైనల్‌కు వచ్చింది. పైగా తమ హోమ్ గ్రౌండ్లో ఆట ఆ జట్టుకు అడ్వాంటేజ్ కానుంది. మరి, ఆఖరాటలో టైటాన్స్.. పాటిదార్సేనను ఎలా అడ్డుకుంటుందో చూడాలి.
భీకర బ్యాటింగ్.. కూల్ కెప్టెన్
ఈ సీజన్లో ఆర్సీబీ అత్యంత దూకుడుగా, రిస్క్‌తో కూడిన బ్యాటింగ్ శైలిని అవలంబించింది. పిచ్ స్వభావం, ప్రత్యర్థి బౌలింగ్ వ్యూహాలతో సంబంధం లేకుండా విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, ఫిలిప్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ సీజన్లో ఆర్సీబీ ఏకంగా ఎనిమిదిసార్లు 200 ప్లస్ స్కోర్లు చేసింది. మరోవైపు కెప్టెన్ పాటిదార్ తన ప్రశాంతమైన నిర్ణయాలతో జట్టుకు అద్భుతమైన స్థిరత్వాన్ని అందించాడు. మాజీ కెప్టెన్లు కోహీ, డుప్లెసిస్ అంత దూకుడుగా కనిపించకపోయినా, సీనియర్లను, యువ ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ జట్టును విజయవంతంగా నడిపించాడు. బ్యాటింగ్‌తో పాటు ఆర్సీబీ బౌలింగ్ విభాగం కూడా పవర్‌ప్లే నుంచే ప్రత్యర్థులను కట్టడి చేస్తోంది. 26 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్న భువనేశ్వర్ పేస్ దాడికి నాయకత్వం వహిస్తున్నాడు. అతడికి తోడుగా హేజిల్‌వుడ్ (13 వికెట్లు), రసిఖ్ సలామ్ (16 వికెట్లు), కృనాల్ పాండ్యా (13 వికెట్లు) వైవిధ్యమైన బౌలింగ్‌తో రాణిస్తున్నారు. కృనాల్ బ్యాట్‌తోనూ జట్టుకు ఉపయోగకరమైన పరుగులు అందించాడు. అయితే గుజరాత్ టాపార్డర్‌ను ఆర్సీబీ బౌలర్లు ఏమేరకు కట్టడి చేస్తుందనేదే అత్యంత కీలకం కానుంది.
టాపార్డర్, బౌలర్లపైనే జీటీ భారం..
ఈ సీజన్లో మిగతా జట్లు పవర్‌ప్లేలో ఓవర్‌కు 11 నుంచి 12 పరుగులు రాబడుతుంటే గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ 9 రన్‌రేట్‌తో సంప్రదాయ పద్ధతిలోనే ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. ఆ టీమ్ మిడిల్ ఆర్డర్ కాస్త బలహీనంగా ఉండటమే ఇందుకు కారణం. అందువల్ల టాప్-3బ్యాటర్లయిన గిల్, సుదర్శన్, జోస్ బట్లర్లపైనే భారీ భారం పడింది. గిల్ (163 స్ట్రయిక్ రేట్‌తో 722 రన్స్), సుదర్శన్ (159 స్ట్రయిక్ రేట్‌తో 710 రన్స్), బట్లర్ (157 స్ట్రయిక్ రేట్‌తో 507 ) ఈ సీజన్లో అత్యంత స్థిరంగా రాణించారు. ఆఖరి మ్యాచ్‌లోనూ ఈ ముగ్గురిపైనే జీటీ గంపెడాశలు పెట్టుకుంది. ఇక, ఈ సీజన్లో సొంత మైదానంలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 గెలవడం గుజరాత్‌కు సానుకూలాంశం. బౌలింగ్ విభాగంలో ఆర్సీబీపై టైటాన్స్‌కు స్వల్ప ఆధిక్యం ఉంది. ముఖ్యంగా అహ్మదాబాద్ పిచ్ ఏమాత్రం అనుకూలించినా జీటీ బౌలర్లు మరింత ప్రమాదకరంగా మారుతారు.
28 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న కగిసో రబాడ ఈ విభాగాన్ని నడిపిస్తున్నాడు. అతడికి తోడుగా మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్, ప్రసిధ్ కృష్ణ బౌలింగ్ భారాన్ని మోస్తున్నారు. ఈ సీజన్లో రబాడ, సిరాజ్ వరుసగా 165, 162 డాట్ బాల్స్ వేసి బ్యాటర్లను కట్టడి చేశారు. హార్డ్ లెంగ్త్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు పెద్ద షాట్లు ఆడే అవకాశం ఇవ్వకుండాఅడ్డుకుంటున్నారు. అయితే, సిరాజ్ ఫిట్నెస్ ఇప్పుడు కాస్త ఆందోళన కలిగిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో గత మ్యాచ్‌లో సిరాజ్ భుజం నొప్పితో ఇబ్బంది పడ్డాడు. తన 4 ఓవర్ల కోటాను పూర్తి చేసినప్పటికీ మైదానంలో అసౌకర్యంగా కనిపించాడు. ఫైనల్ మ్యాచ్‌లో సిరాజ్ లేకపోతే జీటీ బౌలింగ్ కాంబినేషన్ దెబ్బతినే చాన్సుంది.
పిచ్/వాతావరణం
గత ఫైనల్‌కు ఉపయోగించిన పిచ్‌పై ఈ మెగా ఫైట్ జరగనుంది.ఈ రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌తో సహా ఈ సీజన్లో దీన్ని ఇప్పటికే రెండుసార్లు ఉపయోగించారు. అహ్మదాబాద్ వికెట్ సాధారణంగా ఛేజింగ్ చేసే జట్లకు అనుకూలంగా ఉంటుంది. గత ఆరు ఫైనల్స్‌లో నాలుగు ఛేజింగ్ చేసిన జట్లే గెలుచుకున్నాయి. అహ్మదాబాద్‌లో ఆదివారం వర్ష సూచన లేదు. మ్యాచ్‌కు అంతరాయం కలిగితే సోమవారం రిజర్వ్ డే ఉంది.