Shreyas Iyer | గత ఏడాది కాలంలో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ మెరుగుపడిందని భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అయ్యర్ పంజాబ్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచులో 42 బంతుల్లోనే అజేయంగా 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్‌కు 244 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసి ఓటమిపాలైంది. బీసీసీఐ మాజీ చైర్మన్ మాట్లాడుతూ శ్రేయాస్ అయ్యర్ తన స్థాయిని పెంచుకున్నాడని.. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడన్నారు. కొన్ని సమస్యల తర్వాత అయ్యర్ ఆట మెరుగుపడడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం టీమిండియా వన్డే ఫార్మాట్లో మాత్రమే చోటు దక్కించుకున్నాడు. టీ20లు, టెస్టు జట్టులో చోటు సాధించేందుకు ఇబ్బందిపడుతున్నాడు.
ఇటీవల ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా అయ్యర్ నిలిచాడు. ఈ ఐసీసీ టోర్నీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ టైటిల్‌ను గెలిచింది. గత సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో కేకేఆర్ విజేతగా నిలిచింది. ఈ ఐపీఎల్ సీజన్‌కు ముందు జరిగిన వేలానికి ముందు కేకేఆర్ నుంచి బయటకు వచ్చారు. వేలంలో పంజాబ్ కింగ్స్‌కు భారీ ధరకు అయ్యర్‌ను కొనుగోలు చేసి.. కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. మంగళవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే గెలిచింది. ఈ మ్యాచ్‌లో 97 పరుగులు చేసి అయ్యర్ కీలకపాత్ర పోషించారు. ఏ జట్టుకైనా కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన సమయంలో అత్యధిక స్కోర్ సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. ఈ జాబితాలో సంజు శాంసన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2021లో రాజస్థాన్ కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన సమయంలో పంజాబ్ కింగ్స్‌పై 119 పరుగులు చేశాడు. 2021లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచి రెండోస్థానంలో ఉన్నాడు.