Women’s Premier League | వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women’s Premier League) గత మూడేళ్లు కొనసాగుతున్నది. రాబోయే రోజుల్లో లీగ్‌లో పాల్గొనే జట్ల సంఖ్యను పెంచున్నారనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎనిమిది జట్లు ఉండగా.. 2022 జట్ల సంఖ్యను పదికి పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డబ్ల్యూపీఎల్‌లో జట్ల పెంపుపై ఐపీఎల్ చైర్మన్, డబ్ల్యూపీఎల్ కమిటీ సభ్యుడు అరుణ్ ధుమాల్ క్లారిటీ ఇచ్చారు. డబ్ల్యూపీఎల్ చాలా అభివృద్ధి చెందిందని.. ప్రస్తుతం జట్ల సంఖ్యను పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఐదు జట్లు పాల్గొంటున్నాయి.
డబ్ల్యూపీఎల్ కమిటీకి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అధ్యక్షత వహిస్తున్నారు. వాస్తవానికి, మూడు సీజన్ల తర్వాత డబ్ల్యూపీఎల్‌లో జట్ల సంఖ్యను పెంచాలని బోర్డు ప్రణాళికను రూపొందించింది. ప్రస్తుతం సంఖ్యను పెంచే విషయంలో బోర్డు తొందరపడడం లేదని.. టోర్నీరి మరింత అభివృద్ధి చేయడం, ఏదైనా జట్టును కొత్తగా చేర్చే ముందు దాన్ని మరింత బలోపేతం చేయాలని.. అదనంగా జట్లను చేర్చే తక్షణ ప్రణాళిక ఏం లేదని ధుమాల్ తెలిపారు. ఇటీవల డబ్ల్యూపీఎల్‌కు ఆదరణ పెరిగింది. స్టేడియంలోనూ ప్రేక్షకులు కనిపిస్తున్నారు. అదే సమయంలో బ్రాడ్కాస్టర్స్కు సైతం వ్యూయర్షిప్ దక్కుతున్నది.
దాంతో ప్రపంచవ్యాప్తంగా మహిళ క్రికెట్‌ను బలోపేతం చేసిందని.. ఈ లీగ్ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని.. మహిళల క్రికెట్‌కు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు ధుమాల్ వివరించారు. ఇదిలా ఉండగా ఇటీవల డబ్ల్యూపీఎల్ మూడో ఎడిషన్ ముగిసిన విషయం తెలిసిందే. రెండోసారి ముంబయి ఇండియన్స్ టైటిల్‌ను గెలిచింది. ఐపీఎల్ ఫార్మాట్ డబ్ల్యూపీఎల్‌కు వర్తించదు. ఈ సీజన్లో డబ్ల్యూపీఎల్ మ్యాచుల హోస్టింగ్‌ను బీసీసీఐ బరోడా, లక్నో, ముంబయి, బెంగళూరుకు అప్పగించింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కులు రూ.951 కోట్లకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే.