TATA IPL 2025 Points Table | ఐపీఎల్ 2025 అట్టహాసంగా మొదలైంది. ఇప్పటి వరకు గ్రూప్ దశలో అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాయి. 18వ సీజన్ మార్చి 22న డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో మొదలైంది. తొలి రౌండ్లో చివరి మ్యాచ్ మంగళవారం గుజరాత్ టైటాన్స్ – పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ ఆడగా.. గత సారి రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
హైదరాబాద్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ 18వ ఎడిషన్‌ను గొప్పగా ప్రారంభించాయి. సన్‌రైజర్స్ జట్టు గత సీజన్ తరహాలోనే ఉత్సాహంగా కనిపిస్తున్నది. ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ చేసింది. రాజస్థాన్ రాయల్స్‌పై హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో 286 పరుగులు చేసి అద్భుతమైన విజయాన్ని ఎస్ఆర్హెచ్ నమోదు చేసింది. రన్ రేట్ ఆధారంగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ టాప్ ప్లేస్‌లో ఉన్నది.
ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఆర్సీబీ సొంత మైదానంలోనే ఓడించింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన తర్వాత.. డిఫెండింగ్ ఛాంపియన్ జట్టు అజింక్య రహానే, సునీల్ నరైన్ మధ్య సెంచరీ భాగస్వామ్యంతో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆర్సీబీ 16.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి.. ఏడు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలిచింది. ఆర్సీబీ రన్‌రేట్ ఆధారంగా పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉన్నది.
ఈ సీజన్ పంజాబ్ కింగ్స్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో ఆడుతున్నది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను 11 పరుగుల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శ్రేయాస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్లో పంజాబ్‌కు రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ అయ్యర్ 42 బంతుల్లోనే 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ప్రియాన్ష్ ఆర్యా, శశాంక్ సింగ్ సైతం రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ మూడోస్థానంలో ఉంది.
ఈ సీజన్లో జరిగిన రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ – ముంబయి ఇండియన్స్ మధ్య చెన్నై చెపాక్ స్టేడియ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. ఐపీఎల్లో వరుసగా ఆరుసార్లు విజేతగా నిలిచిన ముంబయి.. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పేలంగా కనిపించింది. నూర్ అహ్మద్ అద్భుతమైన బౌలింగ్.. రితురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర బ్యాటింగ్‌తో కారణంగా చెన్నై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబయి ఓటమి పాలైనా.. విఘ్నేష్ పుత్తూర్ రూపంలో ఆ జట్టుకు అద్భుతమైన బౌలర్ దొరికాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై నాలుగో స్థానానికి చేరింది.
ఐపీఎల్ 18వ ఎడిషన్ తొలి మ్యాచ్ ఢిల్లీ విజయాన్ని నమోదు చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌ను వికెట్ తేడాతో ఓడించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో.. నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ల విధ్వంసక హాఫ్ సెంచరీలతో రాణించారు. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఢిల్లీ 19.3 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిచింది. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. మ్యాచ్‌లో అశుతోష్ కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్లో జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల ఐదోస్థానంలో నిలిచింది.
హైదరాబాద్, ఆర్సీబీ, పంజాబ్, సీఎస్కే, ఢిల్లీ విజయాలతో ఐపీఎల్‌ను గ్రాండ్‌గా ప్రారంభించాయి. కేకేఆర్, లక్నో, ముంబయి, గుజరాత్, రాజస్థాన్ తొలి మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. బుధవారం నుంచి రెండో మొదలుకానున్నది. ఇప్పటివరకు ఖాతా తెరువని జట్లు విజయం సాధించాలని కసితో ఉన్నాయి. తొలి రౌండ్లో గెలిచిన జట్లు అదే రోజును కొనసాగించనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ తొలి సెంచరీని నమోదు చేశారు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు. సన్‌రైజర్స్ తరపున అరంగేట్రం చేస్తున్న ఇషాన్ 106 పరుగులు చేశాడు. మొదటి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన పర్పుల్ క్యాప్ రేసులో సీఎస్కే బౌలర్ నూర్ అహ్మద్ ముందంజలో ఉన్నాడు.