IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఓపెనర్లు, మిడిలార్డర్ రాణించడంతో రెండో మ్యాచ్‌లోనూ గెలిచింది. అయితే.. స్టార్ ఆల్‌రౌండర్, విధ్వంసక బ్యాటర్ లివింగ్‌స్టోన్(Livingstone) ఇంకా జట్టుతో కలవలేదు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB), లాంక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్(LCCC) అతడికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చాయి. అయినా కూడా… అతను ఎప్పుడు భారత్‌కు వస్తాడు? టీమ్‌తో ఎప్పుడు కలుస్తాడు? అనే విషయంపై స్పష్టత లేదు. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించే అతడి రాక కోసం పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ నిరీక్షిస్తోంది. ‘లివింగ్‌స్టోన్ వచ్చే వారం భారత్ వస్తాడు’ అని ఫ్రాంఛైజీ అధికారి ఒకరు తెలిపారు.
కానీ, ఈసీబీ మాత్రం ఏప్రిల్ రెండో వారంలో లివింగ్‌స్టోన్ ఇండియాకు వెళ్తాడు అని క్రిక్‌బజ్‌తో చెప్పింది. ‘అతను ఇంకా వంద శాతం ఫిట్నెస్ సాధించలేదు. అతన ప్రస్తుతం ఓల్డ్ ట్రఫోర్డ్‌లో రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు. లాంక్షైర్ కౌంటీ క్లబ్ తరఫున మ్యాచ్‌లు ఆడి తన ఫిట్నెస్ మెరుగుపరుచుకుంటున్నాడు’ అని వివరించింది. లివింగ్‌స్టోన్ కొన్నాళ్లుగా కాలి మడిమ, మోకాలి సమస్యలతో బాధ పడుతున్నాడు. అతను పోయిన ఏడాది డిసెంబర్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. 2022 మినీ వేలంలో రూ.11.5 కోట్ల ధరకు ఈ ఆల్‌రౌండర్‌ను పంజాబ్ కొనుగోలు చేసింది.
గత సీజన్లలో పెద్దగా ఆకట్టుకోలేని పంజాబ్ కింగ్స్ 16వ సీజన్లో చేలరేగి ఆడుతోంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పంజాబ్ 7 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు. రెండో మ్యాచ్‌లో శిఖర్ ధావన్ సేన పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్‌ను 5 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 197 రన్స్ కొట్టింది. ఓపెనర్ ప్రభుసింహ్ రానా సింగ్(60) , ధావన్(86) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. భారీ టార్గెట్ ఛేదనలో నాథన్ ఎల్లిస్ నాలుగు వికెట్లతో రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. దాంతో, ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చేసింది.