Todd Murphy : ఆటలో అయినా, జీవితంలో అయినా ప్రతిభ ఒక్కటే సరిపోదు. కాసింత అదృష్టం కూడా తోడవ్వాలి అంటారు. ఆ మాట ఆస్ట్రేలియా యువ కెరటం టాడ్ మర్ఫీ(Todd Murphy)కి పక్కాగా సరిపోతుంది. అవును.. ఒకే ఒక్క సిరీస్‌తో అతను జాక్‌పాటు కొట్టాడు. ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. భారత పర్యటనలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy)లో రాణించిన అతడికి బహుమతిగా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటు లభించింది.
అతడితో పాట్ స్పీడ్‌స్టర్ లారెన్స్ మోరిస్ కూడా 2023 -24 ఏడాదికి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న 24 మందిలో ఉన్నాడు. దాంతో, అతని సంతోషానికి అవధులు లేవు. వారం క్రితమే ఆటగాళ్ల జీతాలు పెంచుతున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆరంగేట్రం సిరీస్‌లోనే మర్ఫీ అదరగొట్టాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్.. నాగ్‌పూర్ టెస్టులో ఏడు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టాడు. సీనియర్ స్పిన్నర్ నాథన్ లయాన్ ప్రభావం చూపలేకపోయిన చోట అతను చెలరేగాడు. మొదటి మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ టెస్టులోనూ అతను సత్తా చాటాడు. నాలుగు టెస్టుల్లో అతను 14 వికెట్లు పడగొట్టాడు. అయితే.. తొలి రెండు టెస్టులు నెగ్గిన టీమిండియా 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది. వరుసగా నాలుగోసారి ట్రోఫీని సాధించి చరిత్ర సృష్టించింది. ఇరుజట్లు మళ్లీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(WTC Final 2023)లో తలపడనున్నాయి. ఈ ఏడాది జూన్ 7 -11 తేదీల్లో ఇంగ్లండ్ లోని ఓవల్ స్టేడియంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.
గత ఏడాది కాలంగ నిలకడగా రాణిస్తూ, ఆసీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. వీళ్లలో సీనియర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌తో పాటు భారత పర్యటనలో అదరగొట్టిన టాడ్ మర్ఫీ, ఆడం జంపా, మిచెల్ మార్ష్ ఉన్నారు. ఇంకా ఎవరెవరు సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో ఉన్నారంటే.. ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, అడం జంపా, కామెరూన్ గ్రీన్, మార్కస్ మ్యారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, లాన్సె మోరిస్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నసెర్, జై రిచర్డ్సన్, సీన్ అబాట్, అష్టన్ అగర్.