Suryakumar Yadav : పొట్టి క్రికెట్లో పెను సంచలనం సృష్టించిన టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ పదహారో సీజన్(IPL 2023)లో సత్తా చాటాడు. తనదైన స్కూప్ షాట్స్, బ్యాటింగ్ విన్యాసాలతో ఫ్యాన్స్‌ను అలరించాడు. భీకర ఫామ్‌లో ఉన్న అతను ఐపీఎల్లో తొలి సెంచరీ బాదాడు. అది కూడా పటిష్టమైన గుజరాత్ టైటాన్స్‌పై. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ 360 డిగ్రీస్ ప్లేయర్ ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
క్వాలిఫైయర్ 2 పోరులోనూ డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స(Gujarat Titans)పై అర్ధ శతకంతో మెరిశాడు. కానీ, మోహిత్ శర్మ ఓవర్లో స్కూప్ షాట్ ఆడబోయి బౌల్డయ్యాడు. ఈ విధ్వంసక బ్యాటర్ ఈ సీజన్లో అత్యద్భుతంగా రాణించాడు. అంతేకాదు తన ఐపీఎల్ కెరీర్లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
ఈ సీజన్ ఆరంభంలో తడబడిన సూర్య ఫామ్ అందుకున్నాక చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన అతను 15 మ్యాచుల్లో 605 రన్స్ కొట్టాడు. దాంతో, ముంబై ఇండియన్స్ తరఫున ఒక సీజన్లో ఆరొందలకు పైగా పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) సూర్య కంటే ముందున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ 2010లో 618 రన్స్ బాదాడు. 181.14 స్ట్రైక్ రేటుతో ఆడిన అతను ఈ సీజన్లో అత్యధికంగా 5 అర్ధ శతకాలు, ఒక సెంచరీ సాధించాడు.
ఐపీఎల్లో తొలి సెంచరీ తర్వాత సూర్య అభివాదం
నిన్న రాత్రి జరిగిన క్వాలిఫైయర్ 2 పోరులో గుజరాత్ అదరగొట్టింది. 5 సార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(129: 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) సెంచరీ బాదడంతో గుజరాత్ 2 వికెట్ల నష్టానికి 233 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో ముంబైకి శుభారంభం దక్కలేదు. సూర్యకుమార్ యాదవ్(55) ఒక్కడే పోరాడాడు. అయితే.. సీనియర్ పేసర్ మోహిత్ శర్మ 5 వికెట్లు తీయడంతో ముంబై 171కు ఆలౌటయ్యింది. దాంతో గుజరాత్ ఆదివారం (మే 28న) చెన్నై సూపర్ కింగ్స్‌తో టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.