IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్(IPL 2024) షెడ్యూల్‌పై ఉత్కంఠ నెలకొంది. మినీ వేలం ముగిసి రెండు నెలలు దాటినా ఇప్పటివరకూ బీసీసీఐ, ఐపీఎల్ మేనేజ్మెంట్ మాత్రం షెడ్యూల్ విడుదల చేయలేదు. దాంతో, టీ 20 వరల్డ్ కప్(T20 World Cup) ముందు ప్రాక్టీస్‌లా పనికొచ్చే ఈ టోర్నీ షెడ్యూల్ కోసం ఆటగాళ్లతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే.. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 17వ సీజన్ షెడ్యూల్‌ను దశల వారీగా ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అరున్ సింగ్ ధుమాల్(Arun Singh Dhumal) నేతృత్వంలోని గవర్నింగ్ కౌన్సిల్ షెడ్యూల్ తేదీలపై కసరత్తు చేస్తోందని, త్వరలోనే ప్రకటన వెల్లడించే చాన్స్ ఉందని భోగట్టా.
ఐపీఎల్ షెడ్యూల్ గురించి సుదీర్ఘంగా చర్చిస్తున్నాం. కేంద్ర హోం శాఖ, ఎన్నికల కమిషన్ పోలింగ్ షెడ్యూల్ ఖరారు చేసిన వెంటనే 17వ సీజన్ షెడ్యూల్ జారీ చేస్తాం అని ఐపీఎల్ వర్గాలు చెప్తున్నాయి. ఐపీఎల్ టోర్నీ, ఎన్నికలు క్లాష్ కావడం ఇదే మొదిసారి కాదు. 2019లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పుడు షెడ్యూల్‌ను రెండు దఫాలుగా ప్రకటించారు. మొదట లీగ్ దశ మ్యాచ్‌ల తేదీలను.. ఆ తర్వాత క్వాలిఫయర్స్, ఎలిమినేటర్, ఫైనల్ తేదీలను వెల్లడించారు.
దాంతో, ఇప్పుడు కూడా ఐపీఎల్ పాలకమండలి అదే పద్ధతిని అనుసరించే అవకాశం ఉంది. ఈ ఏడాది జూన్ 1వ తేదీన టీ20 ప్రపంచ కప్ షూరూ కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మోగా టోర్నీలో 20 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. నిరుడు సొంత గడ్డపై వన్డే ప్రపంచ కప్ చేజార్చుకున్న భారత్.. ఈసారి పొట్టి కప్‌ను ఒడిసిపట్టాలనే కసితో ఉంది. ఈ టోర్నీకి సన్నాహకాల్లో భాగంగానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞులను బీసీసీఐ అఫ్గనిస్థాన్ సిరీస్‌లో ఆడించిన విషయం తెలిసిందే.