Olympics 2036 : విశ్వశక్తిగా ఎదుగుతున్న భారత్.. ఒలింపిక్(Olympics) క్రీడల నిర్వహణకు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. 2036లో విశ్వ క్రీడల ఆతిథ్య హక్కులు దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది ఇండియా. అయితే.. మెగా టోర్నీ నిర్వహణ కోసం భారత్ మరికొంత కాలం నిరీక్షించక తప్పేలా లేదు. కొత్తగా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలైన క్రిస్టీ కొవెంట్రీ(Cristy Koventry)నే అందుకు కారణం.
ఈమధ్యే థామస్ బాచ్ నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆమె .. 2028 తర్వాత ఒలింపిక్స్ నిర్వహణకు జరగాల్సిన దేశాల ఎంపిక ప్రక్రియను వాయిదా వేసింది. గురువారం మీడిమా సమావేశంలో కొవెంట్రీ మాట్లాడుతూ.. బిడ్డింగ్ ప్రక్రియపై వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసింది. ఆ గ్రూప్ సరైన సమయంలో విశ్వ క్రీడల ఆతిథ్యంపై నిర్ణయం తీసుకుంటుందని ఆమె తెలిపింది. దాంతో, తదుపరి హక్కులు దక్కించుకోవాలనున్న భారత్ మరికొన్నాళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
‘ఒలింపిక్ బిడ్డింగ్ ప్రక్రియను వాయిదా వేయాలనుకుంటున్నాం. అందుకు ఐఓసీ సభ్యులు భారీగా మద్దతిస్తున్నారు. ఎందుకంటే.. వాళ్లు ఒలింపిక్ నిర్వహణ హక్కుల ప్రక్రియను పూర్తిగా అవగతం చేసుకోవాలని భావిస్తున్నారు. తదుపరి హోస్ట్ ఎవరు? అనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే.. సమీక్ష తర్వాతే బిడ్డింగ్‌ను వేగవంతం చేయాలనుకుంటున్నాం. ఈ విషయాన్ని వర్కింగ్ గ్రూప్ చూసుకుంటుంది’ అని కొవెంట్రీ వెల్లడించింది. 133 ఏళ్ల చరిత్రలో ఐఓసీ చీఫ్‌గా ఎంపికైన తొలి మహిళగా క్రిస్టీ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.
విశ్వ క్రీడా సంబురమైన ఒలింపిక్స్ నిర్వహణతో దేశ ప్రతిష్ట ఇనుమడిస్తుంది. అందుకే పలు దేశాలు ఈ మోగా టోర్నీ నిర్వహణకు ఆసక్తి చూపిస్తాయి. పారిస్ తర్వాత 2028 ఎడిషన్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరగునుంది. అనంతరం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఒలింపిక్స్ పోటీలు నిర్వహించనున్నారు.