vehicles theft gang | దుండిగల్, జూన్ 26 : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దుండిగల్, సూరారం, బాలానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ ఏసీపీ సీహెచ్ శంకర్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఆయన కథనం ప్రకారం.. దుండిగల్, సూరారం, బాలానగర్ పీఎస్‌ల పరిధిలో గత పక్షం రోజులుగా ద్విచక్ర వాహనాలు మాయమవుతుండటంతో ఫిర్యాదులు అందుకున్న పోలీసులు క్రైమ్, ఎస్ఓటి, లాండ్ ఆర్డర్ పోలీసులు టీంలుగా ఏర్పడి, నిఘా పెంచారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం బహదూర్ పల్లి చౌరస్తాలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు మూడు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా వెళుతుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.
తాళం వేయని ద్విచక్ర వాహనాలే టార్గెట్..
పట్టుబడిన వాహనదారులు పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతోపాటు వాహనాలకు సంబంధించిన ఎటువంటి పత్రాలు చూపకపోవడంతో పీఎస్‌కు తరలించి విచారణ చేపట్టారు. దీంతో సదరు వాహనాలు అపహరణకు గురైనవిగా గుర్తించారు. ఇదే విషయాన్ని నిందితులు అంగీకరించడంతో కేసు నమోదు చేశారు. గాజులరామారంలోని దేవేందర్ నగర్, జగద్గిరిగుట్టకు చెందిన ఎస్కే ఫైజల్ అలియాస్ సోను, అబ్దుల్లా అలియాస్ అబ్బు, సతీష్ తో పాటు మరో మైనర్ బాలుడు జట్టుగా ఏర్పడి జల్సాలు తీర్చుకునేందుకు బైకుల దొంగతనాలకు పాల్పడుతున్నారు.
హోటళ్లు, షాపింగ్ కాంప్లెక్సులు, బస్ స్టాప్‌లు, ఖాళీ ప్రదేశాల్లో నిలిపిన తాళం వేయని ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేసి అపహరిస్తున్నారు. ఇలా గడిచిన పక్షం రోజుల్లో బాలానగర్ పీఎస్ పరిధిలో 2, సూరారం పీఎస్ పరిధిలో 2, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 బైకులను దొంగిలించారు. దొంగిలించిన వాహనాలపైనే తిరుగుతూ పోలీసులకు పట్టుపడ్డారు. నిందితుల నుంచి 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని గురువారం సాయంత్రం రిమాండ్ కు తరలించారు. దొంగలను గుర్తించడంతోపాటు వాహనాలను రికవరీ చేయడంలో కీలకపాత్ర పోషించిన ఎస్ఓటి, క్రైమ్ పోలీసులకు రివార్డులు అందజేసేలా సీపీకి సిఫారసు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో దుండిగల్ సీఐ సతీష్, సూరారం సిఐ భారత్ కుమార్, దుండిగల్, సూరారం పీఎస్ ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సతీష్ తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
Read Also :
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి