Olympics 2036 : ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ పోటీలు నిర్వహించేందుకు భారతదేశం సిద్ధమవుతోంది. స్వదేశంలో తొలిసారి విశ్వక్రీడా పండుగను జరిపేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని ప్రకటించిన భారత ఒలింపిక్ సంఘం (IOA) ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. 2036లో జరుగబోయే విశ్వ క్రీడల హక్కుల సాధన కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC)కి అక్టోబర్ 1వ తేదీన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను సమర్పించింది.
ఈ విషయాన్ని మంగళవారం కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వ కార్యాలయం వెల్లడించింది. ‘ఒలింపిక్ నిర్వహణ హక్కులు దక్కితే ఎన్నో లాభాలు ఉండనున్నాయి. ఆర్ధికవ్యవస్థ పురోగమిస్తుంది. ఇంకా చెప్పాలంటే దేశంలోని యువతకు ఉపాధి, ఉద్యోగవకాశాలు లభిస్తాయి’ అని సదరు మంత్రిత్వ శాఖ తెలిపింది.
🚨 OFFICIAL – Indian Olympic Association submits formal bid to host 2036 Olympics 🇮🇳
IOA has officially submitted a Letter of Intent to the International Olympic Committee pic.twitter.com/SmGqSNVb0y
— The Khel India (@TheKhelIndia) November 5, 2024
క్రికెట్ వరల్డ్ కప్‌తో పాటు ఆసియా క్రీడలను విజయవంతంగా నిర్వహించిన భారత్ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఒలింపిక్స్ పోటీలకు ఆతిథ్యమివ్వలేదు. అందుకని ప్రధాని నరేంద్ర మోడీ ‘మేము ఒలింపిక్స్ నిర్వహిస్తాం’ అని 2023లోనే అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ పెద్దలకు విన్నవించారు. అందులో భాగంగానే భారత ఒలింపిక్ సంఘం విశ్వ క్రీడలు జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నమంటూ ఐఓసీకి లేఖ రాసింది.
పారిస్‌లో ఈ ఏడాదే విశ్వ క్రీడలు ముగియగా.. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్‌లో జరుగబోతున్నాయి. అనంతరం ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ వేదికగా 2032లో విశ్వ క్రీడా సంబురం మొదలవ్వనుంది. ఇక 2036 ఒలింపిక్స్ నిర్వహణ హక్కులు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అయితే.. ఇప్పటికే పదుల సంఖ్యలో దేశాలు ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నామంటూ లేఖలు రాశాయని ఏఓసీ అధ్యక్షుడు థామస్ బాస్చ్ వెల్లడించాడు. దాంతో, భారత్‌కు అవకాశం దక్కుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.