YS Sharmila | ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల నెత్తినే మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.18వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూళ్ల విషయంలో.. మా తప్పేం లేదని, మాకు అసలు సంబంధమే లేదని.. భారం మాది కాదని.. ప్రజల మీదే ఆ మొత్తాన్ని మోపుతున్నారని విమర్శించారు. సర్దుబాటు కాదు ఇది.. ప్రజలకు “సర్దుపోటు” అని అన్నారు. కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన భారీ కరెంటు షాక్ అని వ్యాఖ్యానించారు.
విద్యుత్ ఛార్జీల విషయంలో వైసీపీ చేసింది పాపం అయితే.. రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ పెడుతున్నది శాపం అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే పడే అదనపు భారం ప్రజల నెత్తిన మోపుతారా.. ఐదేళ్లలో వైసీపీ భారం రూ.35వేల కోట్లు.. 5 నెలల్లో కూటమి భారం రూ.18 వేల కోట్లా? వైసీపీకి మీకు ఏంటి తేడా అని నిలదీశారు.
వైసీపీ 9సార్లు ఛార్జీలు పెంచిందని, కూటమి అధికారంలో కొస్తే ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచమని, అవసరమైతే 30 శాతం తగ్గించేలా చూస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు. ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉంటే.. తప్పు ఎవరు చేసినా ఆ భారాన్ని ప్రజలపై మోపొద్దనే చిత్తశుద్ది మీకుంటే.. వెంటనే రూ.18 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పడుతున్న భారంపై నిధులు ఇవ్వాలని మోదీని గల్లా పట్టి అడగాలన్నారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేస్తే ఊరుకోమని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజల ముక్కు పిండి ట్రూఅప్ ఛార్జీల రూపంలో, అధిక కరెంటు బిల్లులు వసూళ్లు చేస్తున్నందుకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.