Carlos Alcaraz : వరల్డ్ నంబర్ 3 కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) అభిమానులకు పెద్ద షాకిచ్చాడు. ఈమధ్యే మాంటేకార్లో మాస్టర్స్(Monte Carlo Masters) టైటిల్ గెలుపొందిన అతడు అనూహ్యంగా మాడ్రిడ్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. కారణం ఏంటంటే.. గత వారం బార్సిలోనా ఓపెన్ ఫైనల్ ఆడుతుండగా అల్కరాజ్ గాయపడ్డాడు. రెండో సెట్ సమయంలో తొడకండరాలు, గజ్జల భాగంలో నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఫలితంగా ఆటపై దృష్టి సారించలేక ఓడిపోయాడు.
కోలుకునేందుకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని అల్కరాజ్కు వైద్యులు సూచించారు. దాంతో, సొంత అభిమానుల సమక్షంలో మాడ్రిడ్ ఓపెన్‌లో ఆడాలనుకున్న అల్కరాజ్ తీవ్రంగా నిరాశ చెందాడు. అల్కారాజ్ ఎప్పుడు కోలుకొని, ఫిట్‌గా మారతాడు అనేది తెలియాల్సి ఉంది. దాంతో, మేలో జరుగబోయే ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ మాజీ ఛాంపియన్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. మే 25వ తేదీన ఫ్రెంచ్ ఓపెన్ మొదలవ్వనుంది. క్లే కోర్టు కింగ్ ఎవరో జూన్ 8న తేలిపోనుంది.
Carlos Alcaraz officially OUT of Madrid with injuries in both adductors.
Clearly doubtful for Rome but hopes to be 100% for Roland Garros. pic.twitter.com/6uwdvcGjoH
— José Morgado (@josemorgado) April 24, 2025
పారిస్ ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన అల్కరాజ్.. మొనాకోలో జరిగిన మాంటే కార్లో మాస్టర్స్(Monte Carlo Masters)లో దుమ్మురేపాడు. ఫైనల్లో ఇటలీకి చెందిన లొరెంజో ముసెట్టి(Lorenzo Musetti)ని చిత్తుగా ఓడించాడు. ఆరోసారి ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడీ స్పెయిన్ స్టార్. గత ఏడాది ఇండియన్ వెల్స్ మాస్టర్స్ ట్రోఫీ తర్వాత అల్కరాజ్కు ఇదే గర్వించదగ్గ విజయం కావడం గమనార్హం.