Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ 108వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఠాగూర్ ఆడిటోరియంలో శనివారం ఘనంగా నిర్వహించారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే కేశవరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, పరిశోధనా రంగాల్లో ఓయూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆధునిక తెలంగాణ రూపకల్పనలో ఓయూ పాత్ర కీలకమైనదన్నారు. సమకాలీన స్థితుగతులు, పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఇప్పటికీ అత్యుత్తమ విద్యాబోధనలో ఓయూ తన స్థానాన్ని నిలువుకుంటోందని, కానీ ఇది సరిపోదని అభిప్రాయపడ్డారు. ఓయూతో తనకున్న అనుబంధాన్ని పూర్వ విద్యార్థిగా ఇక్కడ తిరిగిన రోజులను గుర్తు చేసుకున్నారు.
గౌరవ అతిథిగా హాజరైన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఓయూ విద్యార్థులు సమగ్ర ప్రతిభకు పర్యాయపదంగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు కీలక భూమిక పోషించే అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తాను ఓయూ క్రికెట్ జట్టుతో పాటు బాస్కెట్ బాల్ జట్టులో సభ్యుడిగా ఆడిన రోజులను గుర్తు చేసుకున్నారు. అతి చిన్న వయసులో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యానని చెప్పుకొచ్చారు. ఓయూకు రుణపడి ఉన్నానన్న ఆనంద్, ఏదైనా చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇందుకు అవసరమైన కార్యాచరణతో విశ్వవిద్యాలయ పాలకవర్గం ముందుకు రావాలని సూచించారు. ఓయూ దేశ స్థాయిలో రాణించేలా పాఠ్య ప్రణాళికల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. పోలీసు అధికారిగా రెండు వైపులా విశ్లేషణ చేసే అవకాశం తనకు ఉంటుందన్న ఆయన, ఓయూ ప్రతిష్టలో ఉపయోగపడే ప్రతి అవకాశాన్ని వదులుకోనని స్పష్టం చేశారు. తన తాత దూరదృష్టి పట్ల ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ మనవడు నవాబ్ మీర్ నజాఫ్ అలీఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. నిజాం వారసుడిగా ఉస్మానియా విజయాలను చూసి గర్విస్తున్నానని అన్నారు.
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. 1966లో ఏర్పాటైన కొఠారి కమీషన్ విద్యారంగానికి ఆరు శాతం నిధులు కేటాయించాలని చెప్పినప్పటికీ, నేటికీ ఈ కేటాయింపులు నాలుగు శాతానికి మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగంపై అజమాయిషీ చేయటానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. యూజీసీ నామమాత్రపు నిధులను కేటాయిస్తూ, సర్క్యులర్ల పేరుతో విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని ప్రశ్నార్థకం చేస్తోందని వాపోయారు.
ప్రముఖ కవి అందెశ్రీ మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయ గాలికి, నేలకు వైబ్రేషన్ ఉంటుందని, అవకాశం దొరికిన ప్రతి సందర్భం ఓయూలో గడిపేందుకే ఇష్టపడుతానని అన్నారు. ఈ చెట్ల కిందే ఎన్నో పాటలు రాసిన సందర్భాన్ని గుర్తు చేశారు.
ఆవిర్భావ దినోత్సవ ముగింపు వేడుకలకు గౌరవ అతిథిగా హాజరైన ఐఏఎస్ అధికారి, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన మాట్లాడుతూ ప్రతిష్టాత్మక ఓయూ ఆవిర్భావ వేడుక్లలో పాల్గొనటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఓయూకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఓయూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్, యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ లావణ్య, విద్యార్థి వ్యహారాల డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర నాయక్, కార్యక్రమ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కొండానాగేశ్వర్ రావు, ఇతర సీనియర్ అధ్యాపకులు, ప్రిన్సిపల్స్, డీన్లు, డైరెక్టర్లు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.