Paralympics | పారిస్: రెండు వారాలుగా పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో భారత్ అంచనాలకు మించి రాణించి సత్తా చాటింది. పారిస్‌లో 25 పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత పారా క్రీడాకారుల బృందం.. లక్ష్యాన్ని అధిగమించడమే గాక మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. గత పారాలింపిక్స్ (టోక్యో)లో నెగ్గిన 19 పతకాలే ఇప్పటివరకూ అత్యధికం కాగా పారిస్‌లో మాత్రం అంతకంటే మరో పది పతకాలు ఎక్కువే సాధించింది. 84 మంది బృందంతో పారిస్‌కు వెళ్లిన భారత్‌కు ఐదు క్రీడాంశాల (ఆర్చరీ, బ్యాడ్మింటన్, షూటింగ్, జూడో, అథ్లెటిక్స్)లో ఏడు స్వర్ణాలు, 9 రజతాలు 13 కాంస్య పతకాలతో అదరగొట్టింది.
ఆరంభంలో షట్లర్లు, షూటర్లు రెండంకెల పతకాలకు పునాది వేస్తే అథ్లెట్ల రంగప్రవేశంతో భారత్ పతక రేసులో రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. సమ్మర్ ఒలింపిక్స్‌లో రెండంకెల పతకాలు సాధించడానికి నానా తంటాలు పడుతున్న భారత్‌కు పారా అథ్లెట్లు మాత్రం పతకాల పంట పండించారు. మన పారా వీరుల అత్యద్భుత ప్రదర్శనలతో పతకాల పట్టికలో భారత్.. స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, అర్జెంటీనా వంటి దేశాలను వెనక్కినెట్టి టాప్-20లో (18వ స్థానం) నిలవడం విశేషం. ఆదివారంతో పారాలింపిక్స్ అట్టహాసంగా ముగిశాయి.
దేశానికి మొత్తం వచ్చిన పతకాలలో సింహ భాగం (17) పారా అథ్లెట్లు తెచ్చినవే. స్వర్ణాల విషయంలోనూ అథ్లెట్లు (4) సత్తా చాటారు. తొలిసారి పారాలింపిక్స్‌లో పాల్గొంటూ పతకాలు కొల్లగొట్టిన దీప్తి జివాంజి, ప్రీతి పాల్, శీతల్ దేవీ వంటివారు కొందరుకాగా వరుసగా రెండు, మూడు ఎడిషన్లలో పతకాలు సాధించిన సుమిత్ అంటిల్, అవని లేఖరా, తంగవేలు మరియప్పన్ వంటి క్రీడాకారులూ ఉన్నారు. చేతులు అత్యంత ప్రధానమైన ఆర్చరీ వంటి ఆటలో రెండు చేతులూ లేకున్నా బరిలోకి దిగి కాలితో బాణాలు సంధించిన 17 ఏండ్ల యువ ఆర్చర్ శీతల్ దేవీ పోరాటం ఎందరికో స్ఫూర్తినిచ్చింది.
వ్యక్తిగత ఈవెంట్లో తృటిలో స్వర్ణం చేజార్చుకున్న శీతల్.. మిక్స్డ్ ఈవెంట్లో మాత్రం పట్టు వీడలేదు. హర్విందర్ సింగ్ స్వర్ణ గాథ కూడా గుర్తుంచుకునేదే. ఇక అథ్లెటిక్స్ విషయానికొస్తే వంద మీటర్లతో పాటు రెండు వందల మీటర్ల రేసులోనూ ప్రీతి పాల్ కంచు మోత మోగిస్తే తెలంగాణ అమ్మాయి దీప్తి 400 మీటర్ల రేసులో కాంస్య కాంతులు పంచింది. భారత్ ఇంతవరకూ పతకాలు నెగ్గని జూడోలో కపిల్ పర్మర్ పతకం ‘పట్టు’ పట్టగా క్లబ్ త్రో లో ధరంబీర్, ప్రణవ్ స్వర్ణ, రజతాలతో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.
పారాలింపిక్స్‌లో భారత్‌కు శనివారం మరో స్వర్ణ, కాంస్య పతకాలు దక్కాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 కేటగిరీలో నవ్‌దీప్ సింగ్ బంగారు పతకం సాధించాడు. వాస్తవానికి ఈ ఈవెంట్లో ఇరాన్ అథ్లెట్ బేట్ సదేగ్కు అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకానికి అర్హత సాధించాడు.
కానీ అతడు పారాలింపిక్స్ నియమావళికి వ్యతిరేకంగా నల్లజెండాను ప్రదర్శించడంతో నిర్వాహకులు అతడిపై వేటు విధించడంతో 47.32 మీటర్ల త్రో విసిరి రెండో స్థానంలో ఉన్న నవ్‌దీప్ అనూహ్యంగా అగ్రస్థానానికి వెళ్లాడు. ఇక మహిళల 200 మీటర్ల టీ12 రేసులో సిమ్రన్ శర్మ కాంస్యం దక్కించుకుంది. 24.75 సెకన్లలో పరుగును పూర్తిచేసిన సిమ్రన్ (గైడ్ అభయ్ సింగ్).. మూడో స్థానంతో పతకం సాధించింది.