భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ పురుషుల జట్టు రోహిత్ సేనకు కొరకరాని కొయ్యగా మారి టెస్టు సిరీస్‌ను ఒడిసిపట్టుకున్నా.. టీ20 ప్రపంచ చాంపియన్లుగా ఇక్కడకు వచ్చిన కివీస్ అమ్మాయిల జట్టుకు మాత్రం హర్మన్‌ప్రీత్ కౌర్ సేన అనూహ్య షాకిచ్చింది. అబ్బాయిలు సిరీస్ కోల్పోయినా అమ్మాయిలు మాత్రం వదల్లేదు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకుంది. కీలక మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన రికార్డు శతకంతో మెరవగా హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది.
Smriti Mandhana | అహ్మదాబాద్: భారత్, న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమ్ఇండియా 2-1తో గెలుచుకుంది. మంగళవారం ముగిసిన సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన స్మృతి మంధాన (122 బంతుల్లో 100, 10 ఫోర్లు) శతకానికి తోడు హర్మన్‌ప్రీత్ (63 బంతుల్లో 59 నాటౌట్, 6 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో కివీస్ నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని భారత్ 44.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మంధానకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ లభించింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. బ్రూక్ హ్యాలీడే (96 బంతుల్లో 86, 9 ఫోర్లు, 3 సిక్సర్లు), జార్జియా ప్లిమ్మర్ (67 బంతుల్లో 39, 6 ఫోర్లు) రాణించారు.
టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు ఆదిలోనే వరుస షాకులు తాకాయి. గత మ్యాచ్‌లో అర్ధ సెంచరీలతో కదం తొక్కిన సుజీ బేట్స్ (4), కెప్టెన్ సోఫీ డెవిన్ (1)తో పాటు లారెన్ (1) తడబడ్డారు. జెమీమా రోడ్రిగ్స్ మెరుపు ఫీల్డింగ్‌తో సుజీని రనౌట్ చేసింది. 11 ఓవర్లలోపే ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన బ్రూక్ సంయమనంతో ఆడింది. ఓపెనర్ ప్లిమ్మర్ (39)తో కలిసి నాలుగో వికెట్‌కు 30 పరుగులు జోడించిన ఆమె వికెట్ కీపర్ ఇసాబెల్ల గేజ్ (25)తో 64 పరుగులు జతచేసింది. 72 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న బ్రూక్.. ఆఖరి ఓవర్లలో నిష్క్రమించినా లీ తహుహు (24 నాటౌట్) వేగంగా ఆడి కివీస్‌కు పో రాడే స్కోరును అందించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ (3/39), ప్రియా మిశ్రా (2/41) రాణించారు.
గత రెండు మ్యాచ్‌లలో నిరాశపరిచిన స్మృతి మంధాన కీలక మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటింది. షఫాలీ (12) మరోసారి విఫలమైనా మంధాన మాత్రం క్రీజులో కుదురుకునేదాకా ఆచితూచి ఆడింది. వన్‌డౌన్‌లో వచ్చిన యస్తికా భాటియా (35)తో కలిసి రెండో వికెట్‌కు 76 పరుగులు జోడించింది. ఈ ఇద్దరూ కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. అర్ధ సెంచరీ దిశగా సాగుతున్న యస్తికా.. డెవిన్ వేసిన 21వ ఓవర్లో ఆఖరి బంతికి ఆమెకే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఈ క్రమంలో హర్మన్‌ప్రీత్‌తో జత కలిసిన మంధాన.. బ్యాట్‌కు పనిచెప్పింది. 73 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఆమె.. ఆ తర్వాత జోరు పెంచింది. డెవిన్ 37వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 90లలోకి వచ్చిన మంధాన.. కార్సన్ 40వ ఓవర్లో లాంగాఫ్ దిశగా సింగిల్ తీసి కెరీర్లో 8వ శతకాన్ని పూర్తిచేసింది. సెంచరీ తర్వాత మరుసటి బంతికే ఆమె పెవిలియన్ చేరినా జెమీమా రోడ్రిగ్స్ (22), హర్మన్‌ప్రీత్ భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. స్మృతి శతకాల సంఖ్య.
8 ఈ సెంచరీతో ఆమె భారత్ తరఫున వన్డేలలో అత్యధిక శతకాలు చేసిన మిథాలీ రాజ్ (7/211 ఇన్నింగ్స్‌లలో) రికార్డును అధిగమించింది. 88 ఇన్నింగ్స్‌లలోనే స్మృతి ఈ ఘనతను అందుకుంది.
న్యూజిలాండ్: 49.5 ఓవర్లలో 232 ఆలౌట్ (బ్రూక్ 86, ప్లిమ్మర్ 39, దీప్తి 3/39, ప్రియా 2/41)
భారత్: 44.2 ఓవర్లలో 236/4 (మంధాన 100, హర్మన్‌ప్రీత్ 59 నాటౌట్, హన్నా 2/47, డివైన్ 1/44)