IND vs ENG | భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ చేతిలో పొట్టి సిరీస్ పరాజయాన్ని మరిపిస్తూ.. టెస్టు క్రికెట్లో విశ్వరూపం కనబర్చింది. బ్యాటర్ల విజృంభణకు బౌలర్ల సహకారం తోడవడంతో టీమ్ఇండియా 347 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. మహిళల టెస్టు క్రికెట్లో ఇదే అతిపెద్ద విజయం.
ముంబై: సొంతగడ్డపై చాన్నాళ్ల తర్వాత ఆడిన టెస్టులో భారత అమ్మాయిలు అదరగొట్టారు. మూడు రోజుల్లోనే ముగిసిన ఏకైక టెస్టులో హర్మన్‌ప్రీత్ బృందం 347 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఓవర్‌నైట్ స్కోరు 186/6 వద్దే రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత అమ్మాయిలు.. ఇంగ్లండ్ ముందు 479 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. కొండంత ఛేదనలో ఇంగ్లండ్ 131 పరుగులకు ఆలౌటైంది.
శనివారం ఒక్క సెషన్ కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయిన ఇంగ్లండ్ మహిళల జట్టు 27.3 ఓవర్లలో చాపచుట్టేసింది. కెప్టెన్ హీతర్ నైట్ (21) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4, పూజ వస్ర్తాకర్ మూడు వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌ల్లో కలిపి 97 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
1 మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే (347 రన్స్ తేడాతో) అతిపెద్ద విజయం 1998లో పాకిస్థాన్‌పై 309 పరుగులతో గెలిచిన శ్రీలంక రెండో స్థానంలో ఉంది.
భారత్ తొలి ఇన్నింగ్స్: 428; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 136; భారత్ రెండో ఇన్నింగ్స్: 186/6 డిక్లేర్డ్;
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 131 (హీథర్ 21; దీప్తి 4/32, పూజ 3/23).