అసమాన ప్రతిభలేదు..
అచ్చెరువొందే షాట్లు ఆడలేడు..
ఫుట్‌వర్క్ పెద్ద గొప్పదేం కాదు..
టెక్నిక్ కూడా అంతంత మాత్రమే!
ఇలాంటి లక్షణాలతో ఓ క్రికెటర్ భారత జట్టు తరఫున వంద టెస్టులు ఆడగలడని ఊహించగలరా! లెక్కకు మిక్కిలి ఆటగాళ్లు చోటు కోసం ఎదురుచూసే టీమిండియాలో ఇలాంటి ప్లేయర్‌కు చాన్స్ దక్కడమే గొప్ప!! మరి అలాంటి ప్లేయర్ సుదీర్ఘ ఫార్మాట్లో అరుదైన మైలురాయికి చేరువయ్యాడంటే అతడిలో ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది కదా..!!
సకల్ప బలం ముందు విధి రాత కూడా చిన్నబోతుంది అనే తరహాలో.. అసమాన పట్టుదల, ఎవరెస్ట్‌ను మించిన ఏకాగ్రతతో వేల కొద్ది బంతులు ఎదుర్కొన్న ఆ మేలిమి ముత్యమే చతేశ్వర్ అరవింద్ పుజారా! రాహుల్ ద్రవిడ్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించగా.. అతడి స్థానాన్ని భర్తీ చేస్తూ ‘నయా వాల్’గా గుర్తింపు తెచ్చుకున్న పుజ్జీ.. కెరీర్లో వందో టెస్టుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆస్ట్రేలియా ప్రారంభం కానున్న ఢిల్లీ టెస్టు పుజారాకు వందోది. ఈ నేపథ్యంలో అతడి ప్రస్థానాన్ని ఓ సారి పరిశీలిస్తే..
బౌలింగ్ చేస్తున్నది స్పిన్నరా, పేసరా అనే దాంతో సంబంధం లేకుండా.. ఆడుతున్నది స్వదేశంలోనా, విదేశీ పిచ్‌లపైనా అని ఆలోచించుకోకుండా.. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ఔటై తిరిగి పెవిలియన్‌కు చేరే వరకు ఒకే ఏకాగ్రతతో బ్యాటింగ్ చేసే అతికొద్ది మంది క్రికెటర్లలో పుజారా ముందు వరుసలో ఉంటాడు. పరిస్థితులు పరీక్షిస్తున్నా.. ప్రత్యర్థి బౌలరు కవ్విస్తున్నా.. బాడీ లైన్ బౌలింగ్‌తో ఇబ్బంది పెడుతున్నా.. ఏమాత్రం వెరవకుండా గంటలకొద్ది క్రీజులో నిలబడి పోరాడటం పుజారా నైజం. 2010లో తొలిసారి భారత జట్టుకు ఎంపికైన పుజారా.. ఆస్ట్రేలియాపైనే తొలి టెస్టు ఆడాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు పరుగులకే ఔటైన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం సాధించాడు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన పుజారా పరుగుల దాహం ఎక్కడా ఆగకుండా సాగుతోంది. ఇప్పటి వరకు కెరీర్లో 99 టెస్టులాడిన పుజారా 44.15 సగటుతో 7021 పరుగులు చేశాడు. అందులో 19 సెంచరీలు 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఆధునిక క్రికెటర్లకు కాస్త భిన్నంగా ఉండే పుజారా ప్రమోషన్లకు ఆమడదూరంలో ఉంటాడు. కోట్లు కొల్లగొట్టే ఐపీఎల్ కంటే.. టెక్నిక్‌ను మెరుగు పర్చే రంజీ ట్రోఫీ, కౌంటీ క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే పుజ్జీ.. టీమిండియా తరఫున ఐదు వన్డేలు ఆడాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు సుదీర్ఘంగా పూజ చేసే పుజారా.. క్రీజులోకి దిగిన ధ్యానం చేస్తున్నంత శ్రద్ధగా బ్యాటింగ్ కొనసాగిస్తాడు. బ్యాట్‌ను మంత్రదండంలా వాడి.. భారీ షాట్లతో మ్యాచ్ గమనాన్ని మర్చే ఆటగాళ్లు ఎంతోమంది వచ్చిపోతున్నా.. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు పుజారా బ్యాటింగ్ ైస్టెల్ మాత్రం పెద్దగా మారలేదు. ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టడం పుజారాకు వెన్నతో పెట్టిన విద్య. జట్టు సభ్యులతో సరదాగా ఉండే పుజారా పై డ్రెస్సింగ్ రూమ్‌లో పేలే జోకులకు లెక్కేలేదు. పూజ చేయడం అతడి నిత్యకృత్యం కాగా.. అతడి భార్య పేరు కూడా పూజనే కావడం గమనార్హం.
వికెట్ల పతనాన్ని ఆపాలన్నా.. కష్టమైన పిచ్‌పై క్రీజులో కుదురుకోవాలన్నా.. ఠక్కున గుర్తొచ్చే పేరు పుజారా.. అంతలా టెస్టు క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన పుజారా భారత్ తరఫున వందో టెస్టు ఆడనున్నాడు. ఇప్పటి వరకు 12 మంది ప్లేయర్లు ఈ ఘనత సాధించగా.. ఇప్పుడు ఆ జాబితాలో చతేశ్వర్ పేరు చేరనుంది. అతడి గొప్పదనాన్ని పరుగులు, సెంచరీలు, క్యాచ్‌ల పరంగా చూసుకుంటే తప్పు చేసినట్లే. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జొహన్నెస్‌బర్గ్ పిచ్‌పై సహచర ఆటగాళ్లు కనీసం నిల్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో అసమాన పట్టుదల ప్రదర్శించిన పూజారా.. 54 బంతుల తర్వాత బోణీ కొట్టాడు. ఆధునిక క్రికెట్లో తొలి పరుగు చేసేందుకు ఇన్ని బంతులు తీసుకున్న మరో ప్లేయర్ లేడంటే అతిశయోక్తి కాదు. ఇది కేవలం ఒక మచ్చుతునకే ఇలాంటి వెల కట్టలేని ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడిన పుజారా.. ఏ రోజు మైదానంలో అసహనం ప్రదర్శించడం, తోటి ఆటగాళ్లపై కసురుకోవడం మచ్చుకైనా కానరావంటే అతడు జెంటిల్మెన్ క్రికెట్‌కు అసలు సిసలు అంబాసిడర్ అనకుండా ఉండలేం.
అంతర్జాతీయంగా ఎంత పేరు ప్రఖ్యాతలు సాధించిన ఆటగాడైన ఆస్ట్రేలియా పిచ్‌లపై తడబడటం పరిపాటే. పేస్, బౌన్స్‌కు సహకరించే కంగారూ గడ్డపై పరుగులు చేయడమంటే ఆషామాషీ కాదు. కానీ అలాంటి చోటే పుజారా తన విలువ చాటుకున్నాడు. సుదీర్ఘ టెస్టు చరిత్రలో ఆసీస్ గడ్డపై ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ నెగ్గని టీమిండియా.. గత రెండు పర్యాయాలు (2018-19, 2020-21లో) బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చేజిక్కించుకుందంటే అది పుజారా చలువే! 2018-19లో తన బ్యాటింగ్ విశ్వరూపం చూపిన పుజారా మూడు సెంచరీలతో కలిపి 521 పరుగులు చేశాడు. సిరీస్ ఆసాంతం దుమ్మురేపిన పుజారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కైవసం చేసుకున్నాడు. ఇక 2020-21లో అతడాడిన ఇన్నింగ్స్‌లను పరుగుల పరంగా కాకుండా బంతుల పరంగా లెక్కిస్తే మేలేమో. ఎందుకంటే వ్యక్తిగత కారణాల వల్ల స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలి టెస్టు అనంతరం స్వదేశానికి చేరిపోగా.. యువకులతో కూడిన బ్యాటింగ్ లైనప్‌ను రహానేతో కలిసి పుజారా ముందుకు నడిపిన తీరు అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా పేస్‌కు స్వర్గధామమైన బ్రిస్బేన్ టెస్టులో అతడి దీక్షను ఎంత పొగిడిన తక్కువే. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 211 బంతులదుర్కొన్నాడంటే పూజారా పోరాటం ఎపాటిదో అర్థం చేసుకోవచ్చు.