ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ పోరుకు భారత్ సర్వశక్తులతో సిద్ధమైంది. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న రోహిత్‌సేన..అమెరికా గడ్డపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేందుకు సమాయత్తమవుతున్నది. 13 ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న ఐసీసీ ట్రోఫీని దక్కించుకునేందుకు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగబోతున్నది. ఐపీఎల్‌తో గత వారం వరకు బిజీగా గడిపిన భారత క్రికెటర్లు ఇక పొట్టి ప్రపంచకప్‌పై దృష్టి పెట్టారు. గతానికి భిన్నంగా ఈసారి 20 జట్లతో జరుగుతున్న మెగాటోర్నీలో సత్తాచాటేందుకు తహతహలాడుతున్నారు. అమెరికా వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు బంగ్లాదేశ్‌తో వామప్ మ్యాచ్ ఆడబోతున్నారు. నేడు జరిగే పోరు ద్వారా టోర్నీకి ముందు సరైన కూర్పు కోసం టీమ్ఇండియా ఒక అంచనాకు వచ్చే అవకాశముంది.
T20 World Cup | న్యూయార్క్: ఐసీసీ మెగాటోర్నీల్లో భారత్‌కు కప్ కలగానే మిగిలిపోతున్నది. మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో చివరిసారి 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ఇండియా అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఆ ఫీట్‌ను పునరావృతం చేయలేకపోయింది. నిరుడు సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ చేరినా..ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో రోహిత్‌సేన రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో గత 11 ఏండ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం చకోరా పక్షిలా ఎదురుచూస్తున్న టీమ్ఇండియా ఈసారైనా తమ కలను సాకారం చేసుకునేందుకు పట్టుదలతో ఉన్నది. ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన క్రికెటర్లు ఐసీసీ టోర్నీలోనూ సత్తాచాటాలన్న కసితో ఉన్నారు. బంగ్లాదేశ్‌తో శనివారం జరిగే ఏకైక వామప్ మ్యాచ్ ద్వారా భారత్ కూర్పుపై ఒక అంచనాకు రానుంది. జూన్ 5వ తేదీన ఐర్లాండ్‌తో జరిగే తమ తొలి మ్యాచ్ నాటికి జట్టు కూర్పుపై స్పష్టత కోసం టీమ్ మేనేజ్మెంట్ ప్రయత్నాలు చేస్తున్నది. ముఖ్యంగా రెండు అంశాలు భారత్‌కు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఓపెనింగ్ కాంబినేషన్‌తో పాటు రెండో పేసర్ ఎవరన్న దానిపై ఒక అంచనాకు వచ్చే అవకాశముంది.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన యశస్వి జైస్వాల్‌ను ఓపెనింగ్‌కు పంపడంపై మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నది. కెప్టెన్ రోహిత్‌శర్మకు జతగా జైస్వాల్‌ను పంపాలా లేక.. విరాట్‌కోహ్లీ, రోహిత్ ఓపెనర్లుగా వెలితే బాగుంటుందా అన్న ఆలోచనతో ఉంది. ఒకవేళ రోహిత్, కోహ్లీ ఓపెనింగ్‌కు వస్తే..మిడిలార్డర్లో పేస్ ఆల్‌రౌండర్ శివమ్దూబేకు లైన్‌క్లియర్ అవుతుంది. దీంతో దూబే రూపంలో అటు హార్డ్‌హిట్టింగ్ బ్యాటింగ్‌కు తోడు స్లోమీడియం పేస్ బౌలర్‌గా వాడుకునే చాన్స్ ఉంది. లేదు జైస్వాల్ జతగా రోహిత్ ఓపెనింగ్‌కు వస్తే..అప్పుడు తుది జట్టులో దూబేకు చోటు దక్కడం కష్టం అవుతుంది. ఐపీఎల్లో సిక్సర్ మెషీన్‌గా మెరుపులు మెరిపించిన దూబేనా లేక.. జైస్వాల్ వైపు మొగ్గు చూపుతారా అన్నది వామప్ మ్యాచ్‌లో తేలనుంది.
యార్కర్ స్పెషలిస్టు జస్ప్రీత్ బుమ్రాకు జతగా మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్సింగ్లో ఎవరిని తీసుకోవాలనేది ఇప్పుడు జట్టుకు తలనొప్పిగా మారింది. ఐపీఎల్లో సిరాజ్, అర్ష్‌దీప్ అంతగా ఆకట్టుకోలేకపోయారు. అయితే అమెరికాలో కొత్తగా తీసుకొచ్చిన ‘డ్రాప్ ఇన్ పిచ్’ ఎలా స్పందిస్తుంది అనేది వామప్ మ్యాచ్ ద్వారా అంచనాకు రావచ్చు. అయితే రెండో పేసర్‌గా సిరాజ్ కంటే అర్ష్‌దీప్ బెటర్ అని మాజీ క్రికెటర్ల అభిప్రాయపడుతున్నారు. ఈ పిచ్‌లపై వైవిధ్యం ప్రదర్శించే బౌలర్లకు వికెట్లు పడే అవకాశముందని వారు చెప్పుకొస్తున్నారు. పేసర్లకు తోడు స్పిన్నర్లు కీలకం అయ్యే అవకాశముంది. మొత్తంగా బంగ్లాతో వామప్ మ్యాచ్ ద్వారా భారత్ ఓ అంచనాకు రానుంది.