షాంఘై (చైనా): ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. గురి తప్పని లక్ష్యంతో భారత్‌కు ఒకేరోజు ఐదు పతకాలు అందించారు. శనివారం జరిగిన కాంపౌండ్ విభాగంలో రెండు స్వర్ణాలు, ఒక రజతంతో పాటు రెండు కాంస్యాలు సాధించారు. అమరావతి (మహారాష్ట్ర)కి చెందిన 24 ఏండ్ల యువ ఆర్చర్ మధుర.. ఒకేరోజు స్వర్ణం, రజతం, కాంస్య ప్రదర్శనతో అదరగొట్టింది.
తన కెరీర్లో రెండో ప్రపంచకప్ ఆడుతున్న ఈ అమ్మాయి.. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంతో పాటు ఉమెన్స్ టీమ్ ఈవెంట్, మిక్స్డ్ టీమ్ పోటీల్లోనూ పతకాలు సాధించింది. వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్లో మధుర.. 139-138 కార్సన్ క్రాహేను ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. ఉమెన్స్ కాంపౌండ్ టీమ్ ఫైనల్లో మధుర, జ్యోతి సురేఖ, చికితతో కూడిన భారత త్రయం.. 221-234తో మెక్సికో చేతిలో ఓడినా రజతం దక్కింది. చికితది పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామం కావడం విశేషం.
ఇక ఇదే విభాగంలోని మిక్స్డ్ టీమ్ కాంస్య పోరులో.. మధుర-అభిషేక్ ద్వయం 144-142తో మలేషియాను ఓడించి పతకం దక్కించుకుంది. అంతకుముందు పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో అభిషేక్, ఒజాస్, రిషభ్.. 232-228తో మెక్సికోను ఓడించి పసిడి గెలిచారు. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ కాంస్య పోరులో 22 ఏండ్ల రిషభ్.. 145-145తో కిమ్ జొంగొ (దక్షిణ కొరియా)ను ఓడించాడు. ఇరువురి స్కోర్లు సమం కాగా షూటాఫ్‌లో రిషభ్ మెరుగైన స్కోరుతో పతకం సాధించాడు.