గువాహటి: మరో రెండు వారాల్లో సొంతగడ్డపై మొదలుకాబోతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఆతిథ్య భారత జట్టు మరోసారి అదరగొట్టింది. స్వదేశంలో 15 నెలల వ్యవధిలోనే న్యూజిలాండ్‌కు టెస్టు, వన్డే సిరీస్‌ను కోల్పోయి తీవ్ర విమర్శలెదుర్కుంటున్న టీమ్ఇండియా.. టీ20ల్లో మాత్రం కివీస్‌కు ఆ అవకాశమివ్వలేదు. బ్యాట్, బంతితో రెచ్చిపోతున్న టీమ్ఇండియా.. గువాహటి వేదికగా జరిగిన మూడో టీ20లో ప్రత్యర్థిపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌లో 3-0 ఆధిక్యం సాధించింది. ఇరుజట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కివీస్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని సూర్య సేన.. 10 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది.
అభిషేక్ శర్మ (20 బంతుల్లో 68 నాటౌట్, 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఎప్పట్లాగే విధ్వంసం సృష్టించగా గత మ్యాచ్‌తో ఫామ్‌ను అందుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 57 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచికొట్టడంతో మరో 60 బంతులు మిగిలుండగానే మెన్ ఇన్ బ్లూను విజయం వరించింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన కివీస్.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ బుమ్రా (3/17), రవి బిష్ణోయ్ (2/18), హార్ధిక్ పాండ్యా (2/23) ధాటికి నిర్ణీత ఓవర్లలో 153/9కే పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 48, 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్.
కివీస్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడానికే తంటాలు పడ్డ పిచ్‌పై ఛేదనలో భారత జట్టు తొలి బంతికే సంజూ శాంసన్ వికెట్ కోల్పోయినా అభిషేక్, గత మ్యాచ్ హీరో ఇషాన్ కిషన్ (28) విధ్వంసంతో లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ దంచేసింది. కిషన్ వస్తూనే 6, 6, 4తో ఛేదనను ప్రారంభించగా అభిషేక్ రెండో ఓవర్లో 6, 4, 4తో డఫ్ఫీకి స్వాగతం పలికాడు. తర్వాతి ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన అతడు ఇషాన్ ఔట్ అయినా దంచుడు ఆపలేదు. దీంతో 5 ఓవర్లకే భారత్ సగం లక్ష్యాన్ని (72/2) ఊదేసింది.
ఇక సూర్య రాకతో బంతి ఫీల్డర్లు, బౌలర్ల చేతిలో కంటే బౌండరీ లైన్ ఆవలే ఎక్కువసేపు ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. డఫ్ఫీ ఆరో ఓవర్లో రెండు బౌండరీలు, సిక్స్‌తో 14 బంతుల్లోనే అభిషేక్ ఫిఫ్టీ పూర్తిచేశాడు. భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన అర్ధ శతకం (మొదటిది యువరాజ్ సింగ్-12 బంతుల్లో 2007 ఇంగ్లండ్‌పై). పవర్ ప్లేలోనే భారత్ 94/2తో నిలిచింది. సూర్య కూడా లయ అందుకోగానే బౌండరీలతో విరుచుకుపడటంతో ఛేదన మరింత తేలికైంది. ఫిలిప్స్ వేసిన పదో ఓవర్లో 6, 4తో వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేసిన కెప్టెన్.. ఆఖరి బంతిని బౌండరీగా మలిచి లాంఛనాన్ని పూర్తిచేశాడు.
న్యూజిలాండ్: 20 ఓవర్లలో 153/9 (ఫిలిప్స్ 48, చాప్మన్ 32, బుమ్రా 3/17, బిష్ణోయ్ 2/18);
భారత్: 10 ఓవర్లలో 155/2 (అభిషేక్ 68*, సూర్య 57*, హెన్రీ 1/28, సోధి 1/28)