రాజ్‌కోట్ : స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత మహిళల జట్టు 2-0తో సిరీస్‌ను దక్కించుకుంది. ఆదివారం రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా.. 116 పరుగుల భారీ తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. రికార్డు స్థాయిలో 50 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 370 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (91 బంతుల్లో 102, 12 ఫోర్లు) కెరీర్లో తొలి శతకంతో విజృంభించగా సారథి స్మృతి మంధాన (54 బంతుల్లో 73, 10 ఫోర్లు, 2 సిక్సర్లు), హర్లీన్ డియోల్ (84 బంతుల్లో 89, 12 ఫోర్లు), ప్రతీక రావల్ (61 బంతుల్లో 67, 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో చెలరేగడంతో టీమ్ఇండియా రికార్డు స్కోరు చేసింది. ఛేదనలో ఐర్లాండ్.. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. కౌల్టర్ (113 బంతుల్లో 80, 10 ఫోర్లు) మినహా మిగిలినవారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వందో వన్డే ఆడిన దీప్తి శర్మ (3/37) మూడు వికెట్లు తీయగా ప్రియా మిశ్రా (2/53) రెండు వికెట్లు పడగొట్టింది. జెమీమాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్‌లో మూడో వన్డే ఇదే వేదికపై బుధవారం జరుగనుంది.
సూపర్ ఫామ్‌లో ఉన్న మంధానతో పాటు ఇటీవలే జట్టులోకి వచ్చిన ప్రతీక.. మరోసారి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆది నుంచే దూకుడుగా ఆడిన ఈ జోడీ తొలి వికెట్‌కు 18 ఓవర్లలో 156 పరుగులు జోడించింది. మంధాన తనదైన శైలిలో విజృంభించి 35 బంతుల్లోనే అర్ద శతకాన్ని పూర్తిచేసింది. ఆమెకు ప్రతీక కూడా జతకలవడంతో భారత స్కోరు వేగం రాకెట్ వేగాన్ని తలపించింది.16వ ఓవర్లో భారీ సిక్సర్‌తో ప్రతీక కూడా ఫిఫ్టీ మార్కును అందుకుంది. ఆడిన 5 ఇన్నింగ్స్‌లలో ఆమెకు ఇది మూడో అర్ధ శతకం. అయితే రెండు బంతుల వ్యవధిలో ఈ ఇద్దరూ ఔట్ అయ్యారు.
ఓపెనర్ల నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన హర్లీన్, జెమీమా ఆరంభంలో ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురుకున్నాక ఈ జోడీ జూలు విదిల్చింది. జార్జియానా 34వ ఓవర్లో హర్లీన్ 3 బౌండరీలు బాదింది. 58 బంతుల్లో ఆమె ఫిఫ్టీ పూర్తయింది. 62 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసిన జెమీమా.. బౌండరీలతో శతకానికి దగ్గరైంది. 48వ ఓవర్లో హర్లీన్ నిష్క్రమించడంతో 183 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆఖరి ఓవర్లో రెండో బంతిని బౌండరీకి తరలించిన జెమీమా.. శతకాన్ని పూర్తిచేసిన వెంటనే బ్యాట్‌ను గిటారుగా మార్చి సెలబ్రేట్ చేసుకుంది.
రికార్డు ఛేదనలో ఐర్లాండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. 8వ ఓవర్లో కెప్టెన్ గాబీ లూయిస్ (12) వికెట్ కోల్పోయిన ఐర్లాండ్.. నెమ్మదిగా ఆడింది. భారత బౌలర్లు వికెట్లు తీయకున్నా కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆ జట్టుకు పరుగుల రాక కష్టమైంది. రెండో వికెట్‌కు కౌల్టర్, సారా ఫోర్బ్స్ (38) కలిసి 55 పరుగులు జోడించారు. ఆ తర్వాత కౌల్టర్.. లారా డెలాని (37)తో కలిసి 4వ వికెట్‌కు 83 పరుగులు జోడించింది. శతకం దిశగా సాగుతున్న కౌల్టర్ను టిటాస్ సధు బౌల్డ్ చేసింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా బ్యాట్ ఝుళిపించకపోవడంతో ఐర్లాండ్ భారీ ఓటమిని మూటగట్టుకుంది.
1 వన్డేలలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. గత నెలలో వెస్టిండీస్‌పై చేసిన 358 పరుగుల రికార్డు కనుమరుగైంది.
భారత్:50 ఓవర్లలో 370/5 (జెమీమా 102, హర్లీన్ 89, ప్రెండర్గస్ట్ 2/75, కెల్లి 2/82)
ఐర్లాండ్: 50 ఓవర్లలో 254/7 (కౌల్టర్ 80, సారా 38, దీప్తి 3/37, ప్రియా 2/53)