పొట్టి ప్రపంచకప్ పోరుకు వేళైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. సరిగ్గా రెండేండ్ల క్రితం కరీబియన్ దీవుల్లో టీమ్ఇండియా కొత్త చరిత్ర లిఖించిన వైనం ఇంకా కండ్ల ముందు కదలాడుతూనే ఉండగా,భారత్, శ్రీలంక వేదికలుగా మెగాటోర్నీకి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. గతానికి పూర్తి భిన్నంగా క్రికెట్‌ను ప్రపంచ వ్యాప్తం చేయాలన్న ఉద్దేశంతో ఈసారి 20 జట్లు పోటీపడుతున్న వరల్డ్‌కప్ శనివారం అట్టహాసంగా మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా టీమ్ఇండియా బరిలోకి దిగుతున్న వేళ దీటైన పోటీనిచ్చేందుకు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ సర్వశక్తులతో సిద్ధమయ్యాయి. బంగ్లాదేశ్‌పై బహిష్కరణ వేటుకు తోడు భారత్‌తో మ్యాచ్ ఆడబోమంటూ పాకిస్థాన్ ప్రకటనల వేళ ఏం జరుగుతుందో అన్న అనుమానాలు మదిలో మెదలుతున్నాయి.
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. భారత్, శ్రీలంక ఆతిథ్యంలో శనివారం మెగాటోర్నీ మొదలుకాబోతున్నది. బంగ్లాదేశ్‌పై బహిష్కరణ వేటు, భారత్‌తో తాము ఆడేది లేదంటూ పాకిస్థాన్ బీరాలు, ఐసీసీ కఠిన చర్యలు వెరసి మరికొన్ని గంటల వ్యవధిలో ప్రపంచకప్ సమరం మన ముందుకు రాబోతున్నది. మొత్తం 20 జట్లు పోటీపడుతున్న మెగాటోర్నీలో టీమ్ఇండియా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో ఉండగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా కప్ వేటలో కసిగా ఉన్నాయి. 20 జట్లు నాలుగు గ్రూపులుగా ఐదేసి జట్లతో పోటీపడనున్నాయి. క్రికెట్‌ను అన్ని దేశాలకు విస్తరించాలన్న ఐసీసీ భవిష్యత్ ప్రణాళికల నేపథ్యంలో ఈసారి కొత్త జట్లకు అవకాశం కల్పించారు.
ప్రతి గ్రూపులో ఒక్కో జట్టు నాలుగేసి మ్యాచ్‌లు ఆడనుంది. ప్రతీ గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఇందులో నుంచి టాప్-4 సెమీఫైనల్లో నిలుస్తాయి. మార్చి 8వ తేదీన ఫైనల్ పోరు జరుగనుంది. భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని అనుసరించి తటస్థ వేదికలో చిరకాల ప్రత్యర్థులు తలపడనునున్నాయి. ఒకవేళ పాక్ ఫైనల్ చేరితే భారత్‌లో కాకుండా శ్రీలంకలో మ్యాచ్ జరుగనుంది. ఈసారి భారత్‌లో మొత్తం ఐదు వేదికలు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌లో మెగాటోర్నీ మ్యాచ్‌లు జరుగనుండగా, శ్రీలంకలో కొలంబో, పల్లెకిలె ఆతిథ్యమివ్వనున్నాయి.
టీ20 ప్రపంచకప్‌లో గ్రూపు-ఏలో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ భారత్..తమ తొలి మ్యాచ్‌లో పసికూన అమెరికాతో తలపడనుంది. టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన టీమ్ఇండియా మెగాటోర్నీని ఘనంగా ప్రారంభిచాలన్న పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై తిరుగులేని సూర్యకుమార్‌యాదవ్ నేతృత్వంలోని భారత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 2023లో సొంత ఇలాఖాలో అందినట్లే అంది చేజారిన వన్డే ప్రపంచకప్ అభిమానుల మదిలో ఇంకా మెదలుతూనే ఉన్న నేపథ్యంలో భారత్ ఈసారైనా అంచనాలు అందుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
గ్రూపు దశలో అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్‌తో ఆడనున్న భారత్.. సూపర్-8 చేరడం లాంఛనమే అయినా టోర్నీ సాగుతున్నా కొద్ది మజా మరోస్థాయికి చేరనుంది. అభిషేక్‌శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, తిలక్‌వర్మ సూపర్ ఫామ్మీదుండటం టీమ్ఇండియాకు కలిసి వచ్చే అంశం. బుమ్రా, అర్ష్‌దీప్‌సింగ్ పేస్ దళాన్ని నడిపించనుండా, వరుణ్, కుల్దీప్, అక్షర్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. మొత్తంగా సొంత ఇలాఖాలో సత్తాచాటేందుకు భారత్ సై అంటున్నది.
