Team India | లండన్: తదుపరి ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ, 2025-27) సైకిల్‌ను భారత జట్టు ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదు టెస్టులతో ఆరంభించనుంది. ప్రస్తుత సైకిల్ (2023-25) వచ్చే ఏడాది జూన్‌తో ముగియనుండగా అప్పటికి టాప్-2లో ఉన్న జట్లు డబ్ల్యూటీసీ ట్రోఫీ కోసం తలపడతాయి. జూన్‌లో జరుగనున్న 2023-25 సైకిల్ ఫైనల్లో భారత్ వరుసగా మూడోసారి తుది పోరుకు అర్హత సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన వెంటనే రోహిత్ సేన ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో వేట మొదలుపెట్టనుంది.
ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంయుక్తంగా షెడ్యూల్‌ను ప్రకటించాయి. జూన్ 20 నుంచి ఆగస్టు 4 దాకా జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా హెడింగ్లీ (లీడ్స్), ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్), లార్డ్స్ (లండన్), ఓల్డ్ ట్రాఫర్డ్ (మాంచెస్టర్), ది ఓవల్ (లండన్) వేదికలను ఈసీబీ ఖరారు చేసింది. 2021లో చివరి సారిగా విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లగా ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమం అయింది.
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ‘క్రికెట్ మక్కా’ అని పిలుచుకునే ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ స్టేడియం తొలిసారిగా మహిళల టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. భారత్, ఇంగ్లండ్ మహిళల మధ్య 2026లో జరుగబోయే ఏకైక టెస్టు లార్డ్స్‌లో జరుగనుందని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. పురుషుల జట్టుతో సమాంతరంగా భారత మహిళల జట్టూ జూన్ 1 నుంచి జూలై 25 దాకా ఇంగ్లండ్‌లో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. పరిమిత ఓవర్ల సిరీస్‌లు ముగిసిన తర్వాత 2026లో భారత్, ఇంగ్లండ్ లార్డ్స్‌లో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడతాయని ఈసీబీ వెల్లడించింది.