Team India | ముంబై: వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు 2-1తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా 60 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. 2019 తర్వాత సొంత ఇలాఖాలో టీమ్ఇండియాకు ఇదే తొలి టీ20 సిరీస్ కావడం విశేషం. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్..నిర్ణీత 20 ఓవర్లలో 217/4 రికార్డు స్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ మందన(47 బంతుల్లో 77, 13ఫోర్లు, సిక్స్)కు తోడు రీచా ఘోష్(21 బంతుల్లో 54, 3ఫోర్లు, 5సిక్స్‌లు) రికార్డు అర్ధసెంచరీతో విజృంభించారు.
మందన సూపర్‌ఫామ్‌తో మెరుగైన ఆరంభం అందించగా, రీచా ఆకాశమే హద్దుగా చెలరేగింది. హెన్రీ, డాటిన్, అలైన్, ఫ్లెచర్ ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన విండీస్..20 ఓవర్లలో 157/9 స్కోరుకు పరిమితమైంది. రాధా యాదవ్ (4/29) ధాటికి హెన్రీ(43) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. రీచాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మందనకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది. ఇరు జట్ల మధ్య వడోదరాలో ఈనెల 22 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.
భారత బ్యాటర్లు మందన, రీచా ఘోష్ మెరుపులు మెరిపించారు. ఒక పరుగుకే ఓపెనర్ ఉమ్రా ఛెత్రీ(0) వికెట్ కోల్పోయిన భారత్‌ను మందన గాడిలో పడేసింది. సిరీస్‌లో సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ రోడ్రిగ్స్(39)తో కలిసి విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. తన ఇన్నింగ్స్‌లో 13ఫోర్లు, భారీ సిక్స్‌తో అలరించిన మందన..ఈ సిరీస్‌లో హ్యాట్రిక్ అర్ధసెంచరీని ఖాతాలో వేసుకుంది.
రోడ్రిగ్స్ ఔట్‌తో రెండో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రాగ్వి బిస్త్(31 నాటౌట్)తో ఇన్నింగ్స్ కొనసాగించిన మందన 77 పరుగుల వద్ద డాటిన్‌కు వికెట్ ఇచ్చుకుంది. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన రీచా..విండీస్‌కు చుక్కలు చూపెట్టింది. బంతి దొరికితే బౌండరీనే అన్న లక్ష్యంగా చెలరేగింది. 5సిక్స్‌లకు తోడు మూడు ఫోర్లతో 18 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకుంది. రీచా ధనాధన్ ఇన్నింగ్స్‌తో భారత్ టీ20ల్లో రికార్డు స్కోరు అందుకుంది.
భారత్: 20 ఓవర్లలో 217/4(మందన 77, రీచా ఘోష్ 54, హెన్రీ 1/14, ఫ్లెచర్ 1/24), వెస్టిండీస్: 20 ఓవర్లలో 157/9(హెన్రీ 43, డాటిన్ 25, రాధాయాదవ్ 4/29, రేణుక 1/16)