Shreyas Iyer : వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ఫేవరేట్ ట్యాగ్ నిలబెట్టుకుంది. సొంత గడ్డపై బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొడుతూ సెమీస్ రేసులో దూసుకెళ్తోంది. ప్రస్తుతం మెగా టోర్నీలో మన జట్టుకు పోటీగా నిలిచే ప్రత్యర్థి కరువైంది. జట్టులో అందరూ అదరగొడుతున్నారు ఒక్క శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) తప్ప. నాలుగో స్థానానికి సరైనోడు అని మాజీలతో కితాబులందుకున్న అయ్యర్ ఫామ్ మేనేజ్మెంట్కు ఆందోళన కలిగిస్తోంది.
స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటానే పేరున్న అయ్యర్ ఇప్పటివరకూ చెప్పకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటంటే ఒక్కటి ఆడలేదు. పునరాగమనం మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాపై సెంచరీ(105) బాదిన అయ్యర్.. ప్రపంచ కప్‌లో ఏకంగా ఆరు మ్యాచుల్లోనూ నిరాశ పరిచాడు. దాంతో, గురువారం శ్రీలంకతో పోరులో అతడికి అగ్నిపరీక్ష కానుంద. ఈ మ్యాచ్‌లో అయ్యర్ విఫలమైతే అతడిపై వేటు తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై అర్ధ శతకం(53) మినహా మిగతా ఐదు మ్యాచుల్లో నిరాశపరిచాడు. అఫ్గానిస్థాన్‌పై అయ్యర్ 25 పరుగులు, బంగ్లాదేశ్‌పై 19 రన్స్, న్యూజిలాండ్‌పై 33 పరుగులు, ఇంగ్లండ్‌పై 4 పరుగులు చేశాడంతే. ఇంగ్లండ్‌పై శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వెంట వెంటనే ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన అయ్యర్ బాధ్యతగా ఆడాల్సింది పోయి.. చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. ఇషాన్ కిషన్‌ను కాదని వరుసగా అవకాశాలు ఇస్తున్నప్పటికీ కోచ్, కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. లంకపై అయ్యర్ రాణించినా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కోలుకుని జట్టులోకి వస్తే అయ్యర్ డగౌట్‌కే పరిమితమయ్యే ఛాన్స్ లేకపోలేదు.