బర్మింగ్‌హామ్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరుకు సర్వం సిద్ధమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ ఆదివారం జరిగే తమ తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనుంది. గతేడాది వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుని జోరుమీదున్న భారత జట్టు.. ఇప్పుడు టీ20 కిరీటాన్ని కూడా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. అందుకోసం పాక్‌ను తొలి దెబ్బ తీసి ట్రోఫీ వేటను విజయంతో ప్రారంభించాలని చూస్తోంది. పాక్‌తో పోలిస్తే భారత జట్టు సమతూకంగా ఉన్నప్పటికీ.. ఓపెనర్లు స్మృతి మంధాన, ఫెఫాలీ వర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఫిబ్రవరిలో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై 82 పరుగులు చేసిన తర్వాత మంధాన తదుపరి ఆరు ఇన్నింగ్స్‌ల్లో (13, 12, 37, 0, 32, 8) నిరాశపరిచింది. షెఫాలీ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై 64 పరుగులు చేసిన తర్వాత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 9, 4, 2, 22, 11 స్కోర్లు మాత్రమే చేయగలిగింది. పాకిస్థాన్‌పై భారత్.. భారీ స్కోరు సాధించాలన్నా, లక్ష్యాన్ని ఛేదించాలన్నా ఈ ఇద్దరు ఓపెనర్లు రాణించడం కీలకం కానుంది.
మిడిలార్డర్ భరోసా..
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇటీవలే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌పై అర్ధ సెంచరీలతో ఫామ్‌లోకి రావడం మిడిలార్డర్‌కు పెద్ద ఊరటనిచ్చే అంశం. కెప్టెన్‌తో పాటు జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, భారతి ఫుల్మాలి పాక్ బౌలింగ్‌ను దెబ్బకొట్టి పరుగులు సాధించే బాధ్యతను మోయాల్సి ఉంటుంది. ఇటీవల ఇంగ్లండతో సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్,బ్యాటర్ యాస్తికా భాటియా అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. సీనియర్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ కూడా బ్యాట్, బాల్‌తో సత్తాచాటితే భారత్‌కు తిరుగుండదు. ఇక, గాయాల కారణంగా బౌలర్లు అమన్‌జోత్ కౌర్, కశ్వీ గౌతమ్ ఈ టోర్నీకి దూరమైనప్పటికీ.. రేణుకా సింగ్, శ్రేయాంకా పాటిల్, రాధా యాదవ్‌తో భారత బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. పాక్ జట్టు తమ కెప్టెన్, టాప్ ఆల్‌రౌండర్ కెప్టెన్ ఫాతిమా సనాపై భారీ అంచనాలు పెట్టుకుంది. ఆమెతో పాటు ఐమన్ ఫామితా నుంచి భారత్‌కు సవాల్ ఎదురవనుంది. కాగా, శనివారం ప్రాక్టీస్ సెషన్లో సనాకు బంతి తగిలి గాయం అయింది. అయితే, తాను బాగానే ఉన్నానని చెప్పడం పాక్‌కు ఊరట కలిగించే అంశం.
రికార్డుల్లో మనదే పైచేయి
దాయాదులో పోరులో భారత్‌దే స్పష్టమైన ఆధిక్యం. టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ 13-3తో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. 2024 దుబాయ్ ప్రపంచకప్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది.