హెడింగ్లీ: భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 465 పరుగులకు ఆలౌట్ చేసిన గిల్ సేన.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 23.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. తద్వారా మెన్ ఇన్ బ్లూ.. 96 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. అంతకుముందు హ్యారీ బ్రూక్ (112 బంతుల్లో 99, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో శతకం చేజార్చుకోగా జెమీ స్మిత్ (40), క్రిస్ వోక్స్ (38) ఆదుకోవడంతో ఇంగ్లిష్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 465 రన్స్ చేసింది. భారత ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (5/83) ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తాచాటగా ప్రసిద్ధ్ కృష్ణ (3/128) మూడు కీలక వికెట్లు పడగొట్టాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ఇండియా సైతం దూకుడుగా ఆడుతున్నది. గత ఇన్నింగ్స్‌లో సెంచరీ హీరో యశస్వీ జైస్వాల్ (4) నిరాశపరిచినా కేఎల్ రాహుల్ (47 నాటౌట్), సాయి సుదర్శన్ (30) రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన సాయి.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం ఆత్మవిశ్వాసంతో ఆడాడు. కానీ మళ్లీ స్టోక్స్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రాహుల్‌తో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (6*) ఉన్నారు. నాలుగో రోజు తొలి సెషనల్ ఆట కీలకం కానుండటంతో గిల్ సేన ఏంచేస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఓవర్ నైట్ స్కోరు 209/3తో మూడో రోజు ఆటకు వచ్చిన ఇంగ్లండ్ తొలి సెషన్ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయినా పెద్దగా ఇబ్బందిపడలేదు. రెండో రోజు శతకంతో మెరిసిన ఓలీ పోప్ (106)ను ప్రసిద్ధ్.. మూడో రోజు రెండో ఓవర్లోనే ఔట్ చేసి ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. ఆరో స్థానంలో వచ్చిన సారథి బెన్ స్టోక్స్ (20).. బుమ్రాను ఎదుర్కోవడానికి ఇబ్బందిపడ్డాడు. డ్రింక్స్ విరామం తర్వాత సిరాజ్ వేసిన ఓవర్లో స్టోక్స్.. పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే మరో ఎండ్‌లో బ్రూక్ మాత్రం ధాటిగా ఆడాడు. వ్యక్తిగత స్కోరు ‘0’ వద్ద ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు.. ప్రసిధ్ వేసిన తొలి ఓవర్లోనే 4, 6తో తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు. ఇన్నింగ్స్ ఆసాంతం అతడి దూకుడు అదే విధంగా కొనసాగింది.
పోప్, స్టోక్స్ త్వరగానే నిష్క్రమించినా జెమీ స్మిత్ (40)తో కలిసి అతడు ఆరో వికెట్‌కు 88 బంతుల్లోనే 73 రన్స్ జోడించాడు. జడేజా బౌలింగ్‌లో సింగిల్‌తో 12వ అర్ధ శతకం పూర్తిచేసుకున్న బ్రూక్.. భారత ఫీల్డర్ల తప్పిదాలతో మరో రెండుసార్లు జీవనదానం పొందాడు. 46 పరుగుల వద్ద పంత్, 82 రన్స్ వద్ద యశస్వీ అతడిచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేశారు. రెండు వికెట్లు కోల్పోయినా ఆ జట్టు తొలి సెషన్లో 28 ఓవర్లు ఆడి 4+ రన్‌రేట్‌తో 118 పరుగులు రాబట్టింది. లంచ్ తర్వాత ప్రసిద్ధ్.. స్మిత్‌ను ఔట్ చేసి మరోసారి భారత్‌కు బ్రేక్‌నిచ్చాడు. బౌండరీ వద్ద జడేజా, సుదర్శన్ సూపర్ క్యాచ్‌తో స్మిత్ పెవిలియన్ చేరాడు. కానీ బ్రూక్ ఆ తర్వాత మరింత వేగంగా ఆడాడు. ముఖ్యంగా సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకున్న అతడు.. రెండు ఓవర్ల వ్యవధిలో హైదరాబాదీ పేసర్‌ను 4, 4, 6, 4తో శిక్షించి సెంచరీకి సమీపించాడు. ప్రసిద్ధ్ బౌలింగ్‌లో అతడు 99 పరుగుల వద్ద పుల్‌షాట్ ఆడబోయి లాంగ్ లెగ్ వద్ద శార్దూల్ చేతికి చిక్కడంతో అతడి గుండె పగిలింది.
బ్రూక్ నిష్క్రమించినా ఇంగ్లిష్ టెయిలెండర్లు పోరాటాన్ని ఆపలేదు. క్రిస్ వోక్స్ (38), బ్రైడన్ కార్స్ (22) 8వ వికెట్‌కు 55 పరుగులు జోడించారు. ఈ జోడీని సిరాజ్ విడదీశాడు. అయినా అప్పటికే ఇంగ్లండ్.. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు(455)కు దగ్గరగానే వచ్చింది. వోక్స్ క్రీజులో ఉండటంతో ఒకదశలో ఇంగ్లండ్ ఆధిక్యం సాధిస్తుందనే భావించారంతా! కానీ బుమ్రా ఇంగ్లండ్‌కు ఆ అవకాశమివ్వలేదు. 99వ ఓవర్లో వోక్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన అతడు.. తన మరుసటి ఓవర్లో టంగ్ (11)నూ బౌల్డ్ చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించడంతో గిల్ సేనకు 6 పరుగుల నామమాత్రపు ఆధిక్యం లభించింది. భారత్ ఆవల ఆడే టెస్టులలో బుమ్రాకు ఇది 12వ ఫైఫర్. తద్వారా అతడు.. కపిల్ దేవ్ (12) రికార్డును అధిగమించాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో భారత్ చెత్త ఫీల్డింగ్‌తో భారీగానే మూల్యం చెల్లించుకుంది. మన ఫీల్డర్లు ఏకంగా ఆరు క్యాచ్‌లు మిస్ చేస్తే అందులో స్లిప్స్‌లో యశస్వీ జారవిడిచినవే 3 కావడం గమనార్హం. బుమ్రా బౌలింగ్‌లోనే 4 క్యాచ్‌లు నేలపాలయ్యాయి. ఇందుకు భారత్ బాగానే మూల్యం చెల్లించుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన పోప్, బ్రూక్, డకెట్ టీమ్ఇండియా ఫీల్డింగ్ తప్పిదాలను అవకాశంగా తీసుకుని ఆ జట్టుకు భారీ స్కోరునందించారు. డకెట్ ఇచ్చిన రెండు క్యాచ్లలో ఒకదాన్ని జైస్వాల్ మరొకదాన్ని జడేజా మిస్ చేశారు. బుమ్రా 31వ ఓవర్లో పోప్ ఇచ్చిన క్యాచ్‌ను జైస్వాల్ జారవిడిచాడు. ఇక బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌లను పంత్, జైస్వాల్ వదిలేశారు. ఇవి మ్యాచ్ ఫలితంపై తప్పకుండా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు
భారత్ తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్ (పోప్ 106, బ్రూక్ 99, బుమ్రా 5/83, ప్రసిద్ధ్ 3/128); భారత్ రెండో ఇన్నింగ్స్: 23.5 ఓవర్లలో 90/2 (రాహుల్ 47*, సాయి 30, స్టోక్స్ 1/18)