IND vs ENG | అహ్మదాబాద్: సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను టీ20లతో పాటు వన్డేలలోనూ మట్టికరిపించిన టీమ్ఇండియా.. బుధవారం వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరో వారం రోజుల్లో తెరలేవనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరు జట్లకు ఇదే ఆఖరి సన్నాహక మ్యాచ్. ఈ నేపథ్యంలో లోపాలను సవరించుకోవడంతో పాటు కూర్పును సరిదిద్దుకునేందుకు రోహిత్ సేనకు ఇదే చివరి అవకాశం. అహ్మదాబాద్‌లో 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత భారత్ ఇక్కడ ఆడబోతున్న తొలి మ్యాచ్ ఇదే. రెండో వన్డేలో సారథి రోహిత్ శర్మ సెంచరీతో ఫామ్‌లోకి రాగా మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తనకు అచ్చొచ్చిన స్టేడియంలో పుంజుకుంటే చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు బెంగ తీరినట్టే. ఇక టీ20లతో పాటు వన్డే సిరీస్‌నూ కోల్పోయిన ఇంగ్లండ్.. మూడో వన్డేలో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.
ఆ ఒక్కడూ మెరిస్తే..
చాలాకాలం తర్వాత రోహిత్.. కటక్‌లో తనదైన రీతిలో చెలరేగి ఫామ్‌లోకి వచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇది అతడితో పాటు జట్టుకూ ధైర్యాన్నిచ్చేదే. టాపార్డర్‌లో గిల్, శ్రేయస్ నిలకడగా రాణిస్తుండగా ఐదో స్థానంలో వస్తున్న అక్షర్ పటేల్ సైతం రాణిస్తున్నాడు. కానీ రన్మిషీన్ కోహ్లీ మాత్రం భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు రంజీలలో ఒక మ్యాచ్ ఆడి విఫలమైన కోహ్లీ.. కటక్‌లోనూ నిరాశపరిచాడు. అహ్మదాబాద్‌లో అతడు రాణించాలని టీమ్ఇండియా ఆశిస్తోంది. కోహ్లీతో పాటు ఈ సిరీస్‌లో విఫలమవుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. చివరి వన్డేలో ఫామ్‌ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అహ్మదాబాద్‌లో పంత్‌ను ఆడిస్తే రాహుల్‌ను పక్కనబెడతారా? అన్నది ఆసక్తికరం. బౌలింగ్‌లో షమీ ఇంకా పూర్తి స్థాయిలో మునపటి లయను అందుకోకపోయినా ఇక్కడ పదుల సంఖ్యలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అతడు సత్తా చాటాలని టీమ్‌మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.
పరువు కోసం బట్లర్ సేన..
జట్టు నిండా మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పటికీ వరుసగా రెండు సిరీస్‌లు కోల్పోయిన బట్లర్ సేన.. ఆఖరి మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. తొలి వన్డేలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా కటక్‌లో ఆ జట్టు బ్యాటర్లు ఫర్వాలేదనిపించారు. డకెట్, సాల్ట్ దూకుడుతో శుభారంభాలు అందిస్తున్నా మిడిలార్డర్ దానిని సద్వినియోగం చేసుకోవడం లేదు. భారత స్పిన్నర్ల మాయ నుంచి ఇంగ్లీష్ బ్యాటర్లు తప్పించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా జడేజా స్పిన్ ఉచ్చులో ఇంగ్లండ్ విలవిల్లాడుతోంది. బ్యాటింగ్ వైఫల్యానికి తోడు ఆ జట్టు బౌలింగ్ కూడా నాసిరకంగా ఉంది. కటక్‌లో రోహిత్ బాదుడుకు ఆ జట్టు బౌలర్లు బలయ్యారు. బ్యాటింగ్‌కు అనుకూలించే అహ్మదాబాద్ పిచ్‌పై ఇంగ్లీష్ బౌలర్లు ఏ మేరకు రాణిస్తారనేది చూడాలి.