భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టుకు వరుణుడు ఆటంకంగా మారాడు. మ్యాచ్ గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్ చేద్దామనుకున్న టీమ్ఇండియా ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తున్నాడు. వర్షంతో గంటన్నర ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ మూడు వికెట్లు చేజార్చుకుని 107 పరుగులు చేసింది. యువ పేసర్ ఆకాశ్‌దీప్ ధాటికి బంగ్లా బ్యాటర్లు తేలిపోయారు. వరుస విరామాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురువడంతో మైదానం చిత్తడిగా మారింది. దీంతో మొదటి రోజు ఆట 35 ఓవర్లకే పరిమితమైంది.
Kanpur Test | కాన్పూర్: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను రెండో టెస్టులోనూ ఆదిలోనే దెబ్బకొట్టి ఆధిపత్యం చెలాయించాలని చూసిన భారత క్రికెట్ జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా శుక్రవారం మొదలైన రెండో టెస్టుకు వరుణుడు పదే పదే అంతరాయం కల్పించాడు. వెలుతురు లేకపోవడం, వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్.. 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. మోమినుల్ హక్ (40 బ్యాటింగ్, 7 ఫోర్లు), ముష్ఫీకర్ రహీమ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్ (2/34) రాణించాడు.
కాన్పూర్‌లో గురువారం రాత్రి వర్షం కురవడంతో గ్రీన్ పార్క్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్ నిర్ణీత సమయాని కంటే గంట (ఉదయం 10:30 గంటలకు) ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన రోహిత్.. ఆశ్చర్యకరంగా ఫీల్డింగ్ (స్వదేశంలో టెస్టు ఆడుతూ టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ చేయడం 2015 తర్వాత ఇదే మొదటిసారి) ఎంచుకోవడంతో పాటు ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగింది. కాన్పూర్ పిచ్ మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించినా రోహిత్ మాత్రం తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగాడు. ఆట ఆరంభమయ్యాక బుమ్రా, సిరాజ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు బంగ్లా ఆచితూచి ఆడింది. ఓపెనర్లు షద్మాన్ ఇస్లాం (24), జకీర్ హసన్ (0) డిఫెన్స్‌కే ప్రాధాన్యమిచ్చారు. జకీర్ అయితే వికెట్ కాపాడుకోవడానికి నానా తంటాలు పడ్డాడు.
బంగ్లా ఇన్నింగ్స్ 9వ ఓవర్లో బంతిని ఆకాశ్దీప్నకు అందించిన రోహిత్ నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. తన తొలి ఓవర్ మూడో బంతికే అతడు.. జకీర్‌ను పెవిలియన్‌కు పంపి భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. జకీర్ ఇచ్చిన క్యాచ్‌ను గల్లీలో జైస్వాల్ ముందుకు డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. తన మూడో ఓవర్లో ఆకాశ్.. మరో ఓపెనర్ షద్నామ్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా సారథి నజ్ముల్ హోసెన్ శాంతో (31, 6 ఫోర్లు) ఆరంభంలో రెండు ఫోర్లు కొట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. లంచ్ సమయానికి ఆ జట్టు స్కోరు 74/2గా ఉంది. ఆటగాళ్లు లంచ్‌కు వెళ్తున్న సమయంలోనే వర్షం రావడంతో రెండో సెషన్ 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం తగ్గాక బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా.. లంచ్ తర్వాత మూడో ఓవర్లో శాంతో వికెట్‌ను కోల్పోయింది. క్రీజులో కుదురుకుంటున్న శాంతోను అశ్విన్ వికెట్ల ముందు బలిగొన్నాడు.
శాంతో నిష్క్రమించిన తర్వాత ఐదు ఓవర్లకు వెలుతురు సరిగ్గా లేకపోవడంతో అంపైర్లు కొద్దిసేపు ఆటను నిలిపేశారు. అదే సమయంలో మొదలైన వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో తొలి రోజు ఆటను నిలిపేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.
2 శాంతోను ఔట్ చేయడం ద్వారా ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ (420)గా అశ్విన్ నిలిచాడు. ఈ క్రమంలో అతడు కుంబ్లే (419)ను దాటేశాడు. మురళీధరన్ (612) అగ్రస్థానంలో ఉన్నాడు.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఒళ్లంతా పులిచారలు, చేతిలో ఆ దేశ జెండాను పట్టుకుని కనబడే సూపర్ ఫ్యాన్ ‘టైగర్ రాబీ’ శుక్రవారం దవాఖాన పాలయ్యాడు. రెండో టెస్టు సందర్భంగా స్టాండ్ ‘సీ’లో ఉన్న అతడు ఉన్నట్టుండి అస్వస్థతకు గురవడంతో అక్కడే ఉన్న పోలీసులు వెంటనే రాబీని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ‘మ్యాచ్ జరుగుతుండగా అతడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గా ఉంది’ అని కాన్పూర్ అడిషనల్ కమిషనర్ హరీష్ చందర్ తెలిపారు. కానీ అంతకుముందు రాబీ అతడిపై ఎవరో దాడి చేశారని.. తన వీపుతో పాటు పక్కటెముకల మీద ఎవరో బలంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయానని చెప్పడం గమనార్హం.