స్పిన్నర్లు విజృంభించడంతో గత రెండు టెస్టుల్లో సులువుగా గెలిచిన భారత జట్టు.. ఆస్ట్రేలియాతో మూడో మ్యాచ్‌కు రెడీ అయింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రోహిత్ సేన ఇండోర్‌లో అదే జోరు కొనసాగిస్తే.. టీమ్ఇండియాకు లండన్ టికెట్ దక్కడం ఖాయమే. తొలి రెండు టెస్టుల్లో స్పిన్ ఉచ్చులో చిక్కుకొని విలవిలలాడిన కంగారూలు.. న్యూఢిల్లీ మ్యాచ్ అనంతరం లభించిన విరామాన్ని సద్వినియోగ పర్చుకున్నారు. మరి పరుగుల వరద పారే ఇండోర్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి!
ఇండోర్: తొలి రెండు టెస్టుల్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చి ఇప్పటికే ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్ నిలబెట్టుకున్న టీమ్ఇండియా.. బుధవారం నుంచి ఆస్ట్రేలియాతో మూడో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే రోహిత్ సేన నేరుగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించనుండటంతో ఆసక్తి మరింత పెరిగింది. దీంతో పాటు ఈ మ్యాచ్ గెలిస్తే.. భారత జట్టు సొంతగడ్డపై వరుసగా 16వ సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకోనుంది. అలాగే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానానికి చేరనుంది. ఇన్ని ప్రత్యేకతల సమాహారమైన మ్యాచ్‌లో సత్తాచాటేందుకు టీమ్ఇండియా అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకోగా.. గత రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా పోటీనివ్వలేకపోయిన కంగారూలు ఈ సారి దుమ్మురేపాలని భావిస్తున్నారు. స్వదేశీ పిచ్‌లపై భారత బౌలింగ్‌కు ఢోకా లేకున్నా.. తుది జట్టు ఎంపిక మేనేజ్మెంట్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది.
ఫామ్‌లేమితో సతమతమవుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను తప్పించి అతడి స్థానంలో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని మాజీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జట్టు ఎంపిక ఆసక్తి రేకెత్తిస్తున్నది. టీమ్ ఎంపిక సమయంలోనే సెలెక్టర్లు కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఒకే శతకం నమోదు కాగా.. అది రోహిత్ శర్మ బ్యాట్ నుంచి వచ్చింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇటీవల మూడు శతకాలు బాదిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు.
పుజారా, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్ కూడా రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో మరోసారి స్పిన్నర్లు కీలకం కానుండగా.. ఈ మైదానంలో అశ్విన్‌కు మెరుగైన రికార్డు ఉంది. మరోవైపు వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. రెండో మ్యాచ్ తర్వాత దక్కిన సుదీర్ఘ విరామాన్ని వినియోగించుకున్న కంగారూలు ఇండోర్‌లో మరింత పట్టుదల ప్రదర్శించడం ఖాయమే. న్యూఢిల్లీ టెస్టులో స్వీప్ షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నామని ఈ సారి భిన్నమైన రీతిలో సిద్ధమయ్యామని స్మిత్ పేర్కొన్నాడు.
ఇక్కడ గతంలో జరిగిన రెండు టెస్టుల్లోనూ పిచ్ పేస్‌కు సహకరించింది. మ్యాచ్ సాగుతున్నా కొద్ది స్పిన్నర్లకు సహాయం లభించడం ఖాయమే. వికెట్‌పై పచ్చిక ఉంది. మ్యాచ్‌కు వర్షం అడ్డంకి లేదు.
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్/గిల్, పుజారా, కోహ్లీ, శ్రేయస్, జడేజా, భరత్, అశ్విన్, అక్షర్, షమీ, సిరాజ్.
ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), హెడ్, ఖవాజా, లబుషేన్, హ్యాండ్స్కోంబ్, గ్రీన్, కారీ, స్టార్క్, మార్ఫీ, లియాన్, కునేమన్.
‘వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించడం పెద్ద విషయం కాదు. ఇది దేనికో సంకేతం అనుకోవాల్సిన అవసరం లేదు. ట్రాస్‌కు ముందు తుది పదకొండు మందిని ఎంపిక చేస్తాం’
-రోహిత్‌శర్మ, భారత కెప్టెన్