నాగ్‌పూర్: వచ్చే నెలలో సొంతగడ్డ వేదికగా ఆరంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత క్రికెట్ జట్టు మరో కీలక సమరానికి సిద్ధమైంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం (జనవరి 21) నాగ్‌పూర్‌లో తొలి మ్యాచ్ ఆడనుంది. మెగా టోర్నీకి ఆఖరి సన్నాహకంగా జరుగనున్న ఈ సిరీస్ టీమ్ఇండియాకు అత్యంత కీలకం. ఇప్పటికే జట్టు బలాలు, బలహీనతలు, కూర్పుపై అవగాహనకు వచ్చిన మెన్ ఇన్ బ్లూకు.. తమ సన్నద్ధతను పరీక్షించుకునేందుకు ఈ సిరీస్ ఆఖరి అవకాశం. మరోవైపు ఏడాదిన్నర వ్యవధిలో భారత్‌లో భారత్‌ను టెస్టుల్లో, వన్డేల్లో ఓడించిన న్యూజిలాండ్.. టీ20ల్లోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య రసవత్తర పోరు జరుగడం ఖాయంగా కనిపిస్తున్నది.
ఆ ఒక్కటి తప్ప..!
గత ఎడిషన్ (2024)లో పొట్టి కప్పును కైవసం చేసుకున్నాక భారత టీ20 జట్టు మరో స్థాయి ఆటతో దూసుకుపోతున్నది. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత భారత్ 36 టీ20లు ఆడితే ఏకంగా 27 మ్యాచ్‌లు గెలిచి ఐదింట్లో మాత్రమే ఓడింది. రోహిత్ నుంచి సారథ్య పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 25 మ్యాచ్‌లు ఆడితే ఏకంగా 18 గెలవడం గమనార్హం. విజయవంతమైన సారథిగా ప్రశంసలు అందుకుంటున్న సూర్య.. బ్యాటర్‌గా మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. నిరుడు అతడు 19 ఇన్నింగ్స్‌ల్లో 218 రన్స్ మాత్రమే చేయగా అందులో ఒక్క అర్ధ శతకమూ లేదు. ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో సారథి ఫామ్‌ను అందుకోవడం అత్యంత అవశ్యకం.
చరిత్రను తిరగరాస్తారా?
2024లో టెస్టు సిరీస్, తాజాగా వన్డే సిరీస్ గెలుపుతో భారత్‌కు స్వదేశంలో షాకిచ్చిన కివీస్.. భారత గడ్డపై టీ20 సిరీస్ విజయాన్ని అందుకోలేదు. గత రెండు సిరీస్ విజయాలు ఇచ్చిన స్ఫూర్తితో టీ20ల్లోనూ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలనే లక్ష్యంతో శాంట్నర్ సేన ఉంది. టిమ్ రాబిన్సన్, రచిన్ రవీంద్ర, మిచెల్, ఫిలిప్స్, చాప్మన్ వంటి హిట్టర్లతో ఆ జట్టు బలంగానే ఉంది.