బుధవారం 25 నవంబర్ 2020
Sports - Nov 14, 2020 , 01:24:04

విరాట్‌ ది బెస్ట్‌: లాంగర్‌

విరాట్‌ ది బెస్ట్‌: లాంగర్‌

మెల్‌బోర్న్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై ఆస్ట్రేలియా హెడ్‌కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్‌ పర్యటనలో తొలి టెస్టు అనంతరం కోహ్లీ భారత్‌కు తిరిగి రావాలనే నిర్ణయం సరైందని.. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని లాంగర్‌ అన్నాడు. జనవరిలో విరాట్‌ భార్య అనుష్క శర్మ తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆమెకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్న కోహ్లీ.. బీసీసీఐని పితృత్వ సెలవు కోరాడు. అతడి నిర్ణయాన్ని గౌరవించిన బోర్డు తొలి టెస్టు అనంతరం భారత్‌కు వచ్చేందుకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం లాంగర్‌ మాట్లాడుతూ.. ‘నేను చూసిన ఆటగాళ్లలో కోహ్లీ అత్యుత్తమం అనేందుకు చాలా కారణాలున్నాయి. అతడి బ్యాటింగ్‌ ఒక్కటే కాదు. ఆటపై విరాట్‌కు ఉండే ఇష్టం, మైదానంలో అతడి శరీర భాష నన్ను చాలా ఆకట్టుకుంటాయి. ఆతడి ఆటతీరు నమ్మశక్యం కాని రీతిలో ఉంటుంది. దీంతో అతడంటే నాకు అమిత గౌరవం. పితృత్వ మాధుర్యాన్ని ఆస్వాదించేందుకు అతడు భారత్‌కు తిరిగి వెళ్లే విషయంలో అభినందిస్తున్నా. విరాట్‌ లేకపోతే సహజంగానే పరిస్థితి మాకు అనుకూలంగా ఉంటుంది. అయితే, టీమ్‌ఇండియా ప్రమాదకరమైన జట్టని మాకు తెలుసు. గత పర్యటనలో వారు ట్రోఫీ చేజిక్కించుకున్నారు’ అని అన్నాడు.