Mumbai Test | ముంబై: స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ తప్పాలంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో భారత్ పట్టు బిగించింది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టపోయి 171 పరుగులు చేసింది. తద్వారా ఆ జట్టు 143 పరుగుల కీలక ఆధిక్యం దక్కించుకుంది. భారత స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా (4/52), రవిచంద్రన్ అశ్విన్ (3/63) బంతితో మాయ చేశారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్ (51) వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీతో ఆదుకోగా మిగిలిన బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 263 పరుగులకు ఆలౌట్ అయింది.
శుభ్‌మన్ గిల్ (146 బంతుల్లో 90, 7 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (59 బంతుల్లో 60, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (36 బంతుల్లో 38 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. రెండోరోజు ఆటలో ఇరుజట్ల బ్యాటర్లు 15 మంది పెవిలియన్ చేరడం గమనార్హం. మూడో రోజు ఆటలో కివీస్‌ను త్వరగా ఆలౌట్ చేయడమే గాక స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బ్యాటర్లు ఏ మేరకు లక్ష్యం దిశగా సాగుతారన్నదానిపై టీమ్ఇండియా విజయం ఆధారపడి ఉంది. లక్ష్యం 150 పరుగులే ఉన్నా వాంఖడేలో నాలుగో ఇన్నింగ్స్ ఛేదన అంత సులభమేమీ కాదు. అదీగాక అజాజ్ పటేల్, ఇష్ సోధి, గ్లెన్ ఫిలిప్స్ పెట్టే స్పిన్ పరీక్షకు రోహిత్ సేన ఎలా ఎదురునిలుస్తుందనేది నాలుగో రోజు ఆటలో ఆసక్తికరం!
తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కించుకున్న భారత్.. రెండో ఇన్నింగ్స్ మొదటి ఓవర్ నుంచే వికెట్ల వేట మొదలుపెట్టింది. ఆకాశ్ దీప్ తొలి ఓవర్ నాలుగో బంతికే కివీస్ సారథి టామ్ లాథమ్ (1)ను ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. టీ విరామం తర్వాత వాషింగ్టన్ సుందర్.. డెవాన్ కాన్వే (22)ను ఔట్ చేసి భారత్‌కు మరో బ్రేక్ ఇచ్చాడు. అశ్విన్ వేసిన మరుసటి ఓవర్లో ముందుకొచ్చి ఆడబోయిన రచిన్ రవీంద్ర (4)ను పంత్ స్టంపౌట్ చేయడంతో కివీస్ 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్ (21)తో కలిసి విల్ యంగ్ మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ ఇద్దరూ 14 ఓవర్ల పాటు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. నాలుగో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం జోడించిన అనంతరం జడ్డూ 28వ ఓవర్లో మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ను మిడాన్ వద్ద అశ్విన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ఓవర్లో జడ్డూ.. బ్లండెల్ (4)నూ ఔట్ చేసి పర్యాటక జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాడు. అతడి స్థా నంలో క్రీజులోకి వచ్చి మూడు సిక్సర్లు బాదిన గ్లెన్ ఫిలిప్స్ (26)ను అశ్విన్ బౌల్డ్ చేశాడు. ఆట ముగిసే సమయానికి అజాజ్ (7 నాటౌట్), ఓరుర్కీ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 86/4తో రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌ను గిల్, పంత్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 96 పరుగులు జతచేసి భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. గిల్ నెమ్మదిగా ఆడినా పంత్ వన్డే తరహా ఆట ఆడాడు. అజాజ్ వేసిన రెండో రోజు తొలి ఓవర్లోనే పంత్ మూడు ఫోర్లు బాదాడు. 36 బంతుల్లోనే అతడి హాఫ్ సెంచరీ పూర్తయింది. గిల్ కూడా టెస్టులలో 7వ అర్ధ శతకాన్ని పూర్తిచేశాడు. 53 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ ఇచ్చిన క్యాచ్‌ను లాంగాఫ్ వద్ద హెన్రీ జారవిడిచినా ఆ అవకాశాన్ని అతడు వినియోగించుకోలేదు.
ఇష్ సోధి 38వ ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. పంత్ ఔట్ అయ్యాక భారత బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి కుప్పకూలింది. 83 పరుగుల వ్యవధిలో భారత్ ఆఖరి 6 వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా (14) నిరాశపరచగా 8వ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ డకౌట్ అయ్యాడు. 90లలోకి వచ్చాక గిల్ కూడా నిష్క్రమించాడు. ఆఖర్లో వాషింగ్టన్ వేగంగా ఆడి భారత్‌కు 28 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు. కివీస్ బౌలర్లలో అజాజ్ (5/103)కు ఐదు వికెట్లు దక్కాయి.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 235 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 263 ఆలౌట్ (గిల్ 90, పంత్ 60, అజాజ్ 5/103)
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 43.3 ఓవర్లలో 171/9 (యంగ్ 51, ఫిలిప్స్ 26, జడేజా 4/52, అశ్విన్ 3/63)