Headingley : సుదీర్ఘ ఫార్మాట్లో భారత జట్టు అసాధారణ పోరాటానికి నిదర్శనాలు చాలానే. గత పదేళ్ల కాలంలో విదేశీ గడ్డపై చరిత్రాత్మక విజయాలు సాధించింది టీమిండియా. ఇప్పుడు మరోసారి సంచలన ప్రదర్శనతో రికార్డులను తిరగరాసే అవకాశం టీమిండియాకు వచ్చింది. ఎందుకంటే.. గత 23 ఏళ్లుగా హెడింగ్లే (Headingley) మైదానంలో భారత్‌కు ఓటమి ఎదురవుతూనే ఉంది. కెప్టెన్లు మారినా సరే అక్కడ గెలుపు సంతకం మాత్రం సాధ్యం కాలేదు. అయితే.. ఈసారి యువరక్తంతో నిండిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill)సేన అద్భుతం చేయాలనుకుంటోంది.
డబ్ల్యూటీసీ సైకిల్లో తొలి సిరీస్, తొలి మ్యాచ్‌ను విజయంతో ఆరంభించి.. ఆతిథ్య ఇంగ్లండ్‌కు కొత్త రికార్డు నెలకొల్పానే కసితో ఉన్నారు కుర్రాళ్లు. ఇంగ్లండ్‌కు కంచుకోటగా పేరొందిన లీడ్స్‌లోని హెడింగ్లే మైదానం భారత జట్టుకు ఎన్నో పీడకలల్ని మిగిల్చింది. ఈ గ్రౌండ్లో ఆతిథ్య జట్టు ఆధిపత్యానికి టీమిండియా తలొగ్గిన సందర్భాలు చాలానే. అయితే..1979లో తొలిసారి హెడింగ్లేలో టీమిండియా మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) వీరోచిత పోరాటంతో పరువు కాపాడుకున్న భారత్.. 1986లో మాత్రం పంజా విసిరింది.
It’s been 23 years since India last won a men’s Test at Headingley 🗓️ pic.twitter.com/5GwGiyLKfH
— ESPNcricinfo (@ESPNcricinfo) June 19, 2025
ఇంగ్లండ్‌ను వణికిస్తూ 279 పరుగుల భారీ విజయంతో చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత విక్టరీ కోసం దాదాపు రెండు దశాబ్దాలునిరీక్షించింది టీమిండియా. సచిన్ టెండూల్కర్(193), సౌరభ్ గంగూలీ(128), ‘వాల్’ రాహుల్ ద్రవిడ్ (148) శతకంతో విజృంభించగా 2002లో ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 628-8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ తలా మూడేసి వికెట్లు తీయగా ఫాలో ఆన్ ఆడింది ఇంగ్లండ్. రెండో ఇన్నింగ్స్‌లోనూ కుంబ్లే(4-66) తిప్పేయగా గెలుపొందిన భారత్‌కు ఈ మైదానంలో ఇదే ఆఖరి విజయం అయింది.
అవును.. 2021లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు గట్టిగానే ప్రయత్నించింది. కానీ, ప్రత్యర్థి బౌలింగ్ దళాన్ని ఎదుర్కోలేక ఇన్నింగ్స్ 76 పరుగుల ఓటమిని మూటగట్టుకుంది. అయితే.. అదంతా గతం. ప్రస్తుతం టీమ్‌లో కెప్టెన్ గిల్‌తో పాటు కేఎల్ రాహుల్, యశస్వీ, రిషభ్ పంత్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్.. బుమ్రా, కుల్దీప్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. తమదైన రోజున వీళ్లు ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలరు.
London 🚄 Leeds
‘Train’ing with #TeamIndia #ENGvIND pic.twitter.com/I1gBsTu0PC
— BCCI (@BCCI) June 18, 2025
ఫార్మాట్ ఏదైనా రికార్డులు బద్ధలు కొట్టడం.. చిరస్మరణీయ విజయాలు సాధించడం టీమిండియాకు కొత్తేమీ కాదు. మరి.. ఈసారి హెడింగ్లేలో విజయగర్జనతో 23 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుందా? లేదా? అనేది తొలి రోజే తేలిపోనుంది. మరో విషయం.. ఇంగ్లండ్ గడ్డపై 2007లో చివరిసారిగా టెస్టు సిరీస్ గెలుపొందింది. ఆ తర్వాత నుంచి అక్కడ ప్రతిసారి పరాజయమే ఎదురవుతోంది. సో.. ఏరకంగా చూసినా తొలిటెస్టు భారత జట్టుకు ఇజ్జత్ కా సవాలే.