High Cholesterol Diet | కొలెస్ట్రాల్ అనగానే మన శరీరంలో ఇది ఒక్కటే ఉందని చాలా మంది భావిస్తారు. కానీ మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్డీఎల్ అంటారు. ఇంకొకటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. మనం రోజూ వ్యాయామం చేయకపోయినా, అనారోగ్యకరమైన ఆహారాలను తింటున్నా, అధికంగా బరువు పెరిగినా, మద్యం సేవించినా, పలు ఇతర కారణాల వల్ల మన శరీరంలో కొవ్వు అధికంగా చేరుతుంది. ఇది ఎల్‌డీఎల్‌గా మారుతుంది. ఎల్‌డీఎల్‌గా మారిన కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో అడ్డుపడి హార్ట్ ఎటాక్ వచ్చేలా చేస్తుంది. కనుక మనం ఎల్‌డీఎల్‌ను ఎల్లప్పుడూ నిర్దిష్టమైన స్థాయిలో ఉంచుకోవాలి. అందుకు గాను హెచ్‌డీఎల్ పనిచేస్తుంది. శరీరంలో హెచ్‌డీఎల్ అధికంగా ఉంటే ఎల్డీఎల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాదు. ఇక ఎల్‌డీఎల్‌ను తగ్గించేందుకు పలు ఆహారాలు కూడా పనిచేస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా మీరు తినే ఇడ్లీ, దోశ, పూరీలకు బదులుగా ఓట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోండి. వీటిల్లో ఉండే ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కొవ్వును తగ్గిస్తాయి. ఎల్‌డీఎల్‌ను అదుపులో ఉంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఓట్స్‌ను మీరు పాలలో వేసి కలిపి తీసుకోవచ్చు. లేదా ఓట్స్‌తో ఉప్మా, ఓట్ మీల్ చేసి తినవచ్చు. ఎంతో రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. బార్లీ గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజుకు ఒక గ్లాస్ మోతాదులో తాగుతుండాలి. ఇలా చేస్తున్నా కూడా కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా ఎల్డీఎల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
కిడ్నీ బీన్స్ (రాజ్మా), బ్లాక్ బీన్స్, నల్ల శనగలు, కాబూలీ శనగలు, పప్పు దినుసులను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి కూడా ఎల్‌డీఎల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. పప్పు దినుసుల్లో ముఖ్యంగా పెసలను రోజూ తినాలి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను గణనీయంగా అదుపులో ఉంచుతాయి. ఆయుర్వేదంలో పలు చికిత్సలు చేసేటప్పుడు రోగులకు కేవలం పెసలను మాత్రమే తినాలని చెబుతుంటారు. పెసల శక్తి అటువంటిది. నెల రోజుల పాటు పెసలను తింటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ అన్నది ఉండదు. వీటిని ఉడకబెట్టి లేదా మొలకల రూపంలో తినవచ్చు. యాపిల్, స్ట్రాబెర్రీలు, నారింజ వంటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక ఈ పండ్లను తరచూ తింటున్నా కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఎల్డీఎల్ అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఎల్‌డీఎల్‌ను అదుపు చేసేందుకు మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉన్న ఆహారాలను తినాలి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఎల్‌డీఎల్‌ను తగ్గిస్తాయి. ఈ ఆహారాల విషయానికి వస్తే అవకాడోలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అవకాడోలను తింటుంటే ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు ఫైబర్ కూడా లభిస్తుంది. ఇది ఎల్‌డీఎల్‌ను తగ్గిస్తుంది. బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్, పల్లీలను నానబెట్టి తింటున్నా కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి ఎల్‌డీఎల్‌ను తగ్గించి గుండెను రక్షిస్తాయి. అవిసె గింజలు, చియా విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాల్లోనూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఇతర ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి ఎల్‌డీఎల్‌ను తగ్గించి గుండెను రక్షిస్తాయి. మీరు వాడే వంటల్లో ఆలివ్ ఆయిల్‌ను చేర్చుకోవాలి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ఎల్‌డీఎల్‌ను తగ్గించి హెచ్‌డీఎల్‌ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. ఇలా పలు ఆహారాలను తింటుంటే అధిక కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు.