MEA : భారత్-కెనడా దేశాల మధ్య అణు సహకార ఒప్పందంపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ (MEA) తోసిపుచ్చింది. భారతదేశపు అణువ్యాప్తి నిరోధక ప్రమాణాలు తప్పుపట్టలేనివని పేర్కొన్నది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. భారత్-కెనడా అణు సహకారం ఒప్పందంపై పాకిస్తాన్ ఆరోపణ నిరాధారమైనదని అన్నారు.
అణువ్యాప్తి నిరోధం విషయంలో భారతదేశపు నిబద్ధత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినదని రణధీర్ జైస్వాల్ చెప్పారు. రహస్య అణు విస్తరణ చరిత్ర కలిగిన దేశం పాకిస్తానేనని విమర్శించారు. అణు విస్తరణ ప్రమాదాలపై పాకిస్థాన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కెనడాతో అణు సహకార ఒప్పందంపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
అణువ్యాప్తి నిరోధానికి సంబంధించి భారతదేశ నిబద్ధత తప్పుపట్టలేనిదని అన్నారు. రహస్య అణు విస్తరణ చరిత్ర కలిగిన పాకిస్థాన్.. విస్తరణ ప్రమాదాల గురించి నిజాలు మాట్లాడదని విమర్శించారు. తన తప్పుల నుంచి ప్రపంచం దృష్టిని మరలించేందుకే పాకిస్థాన్ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు.