రామగిరి, మార్చి 12 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ డిగ్రీ & పీజీ కళాశాల MSW (Master of Social Work) విద్యార్థులు పర్యావరణ అవగాహన కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా మోతె సమీపంలో ఉన్న “ఇండియాస్ గ్రీన్ హార్ట్” అనే మానవ నిర్మిత అరణ్యాన్ని గురువారం సందర్శించారు. ఈ అరణ్యాన్ని పర్యావరణ ప్రేమికుడు దుశ్చర్ల సత్యనారాయణ అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా దుశ్చర్ల సత్యనారాయణ, కళాశాల సోషల్ వర్క్ అధ్యాపకుడు సైదిరెడ్డి విద్యార్థులకు అడవుల ప్రాముఖ్యతను వివరించారు. సుస్థిర అభివృద్ధి సాధనలో అడవులు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో తెలిపారు. అలాగే జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో అడవులు కీలకం కావునా ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ చెట్లను నాటడం, వాటిని సంరక్షించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.