IND vs ZIM : తొలి టీ20లో ఘోర ఓటమికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. పేసర్లు చెలరేగడంతో
జింబాబ్వేపై వంద పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత అభిషేక్ శర్మ(100) మెరుపు సెంచరీ.. రుతురాజ్ గైక్వాడ్(77 నాటౌట్), రింకూ సింగ్ (48 నాటౌట్)ల విధ్వంసంతో 234 కొట్టిన భారత్.. ఆ తర్వాత ప్రత్యర్థిని 134కే ఆలౌట్ చేసింది. అవేశ్ ఖాన్(3/15), ముకేశ్ కుమార్(3/37)లు మూడేసి వికెట్లతో జింబాబ్వే నడ్డి విరిచారు.
టీమిండియా నిర్దేశించిన భారీ ఛేదనలో జింబాబ్వేకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే ఓపెనర్ ఇన్నోసెంట్ కయా(4)ను ముకేశ్ కుమార్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బ్రియాన్ బ్రెన్నెట్(26)తో కలిసి మరో ఓపెనర్ వెస్లే మధెవెరా(43) ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే.. ఈ జోడీని విడదీసి బ్రేక్ ఇవ్వడంతో జింబాబ్వే వికెట్ల పతనం మొదలైంది. ఓవైపు వికెట్లు పడుతున్న వెస్లే ఒంటరి పోరాటం చేసి స్కోర్ 120 దాటించాడు. చివర్లో లుకే జాంగ్వే(33) ధనాధన్ ఆడినా అప్పటికే లక్ష్యం కొండంత ఉంది. చివరి వికెట్‌గా వెనుదిరగడంతో భారత్ 100 పరుగులతో జయభేరి మోగించి సిరీస్‌లో బోణీ కొట్టింది.
తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ యూనిట్‌గా విఫలమైన కుర్రాళ్లు రెండో గేమ్‌లో గేర్ మార్చారు. సిరీస్ సమం చేయాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లను ఓపెనర్ అభిషేక్ శర్మ(100) ఊచకోత కోశాడు. మెరుపు బ్యాటింగ్‌తో సెంచరీ బాదేసి భారీ స్కోర్‌కు బాటలు వేశాడు.
ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్(77 నాటౌట్), రింకూ సింగ్(48 నాటౌట్)లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అభిషేక్ ఔటయ్యాక వీళ్లిద్దరూ బౌండరీలతో విరుచుకుపడడంతో, టీమిండియా స్కోర్ రాకెట్ వేగంతో పరుగులు తీసింది. ఈ ముగ్గురి వీరబాదుడుతో భారత్ ప్రత్యర్థికి 235 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.