దుబాయ్: ఆసియా కప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. టోర్నీలో అపజయమెరుగని టీమ్ఇండియా ..మరో మ్యాచ్ మిగిలుండగానే ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన సూపర్-4 పోరులో భారత్ 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత టీమ్ఇండియా 20 ఓవర్లలో 168/6 స్కోరు చేసింది. అభిషేక్‌శర్మ(37 బంతుల్లో 75, 6ఫోర్లు, 5సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో చెలరేగగా, హార్దిక్ పాండ్యా(38) ఆఖర్లో చెలరేగాడు. రిషాద్(2/27)రెండు వికెట్లు తీశాడు. లక్ష్యఛేదనలో బంగ్లా 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ హసన్(51 బంతుల్లో 69, 3ఫోర్లు, 5సిక్స్‌లు) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది. కుల్దీప్యాదవ్ (3/18), బుమ్రా (2/18), వరుణ్ (2/29) జట్టు విజయంలో కీలకమయ్యారు.
టోర్నీలో సూపర్‌ఫామ్ మీదున్న అభిషేక్‌శర్మ మరోమారు అదరగొట్టాడు. ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అభిషేక్..మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. మరో మూడు బంతుల తేడాతో కీపర్ జేకర్ అలీ క్యాచ్ విడిచిపెట్టడంతో అభిషేక్‌కు రెండో సారి లైఫ్ వచ్చింది. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ మంచి పరిణతి కనబరిచాడు. నసుమ్ నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో గిల్ ఫోర్, సిక్స్‌తో విరుచుకుపడగా, తానేం తక్కువ కాదన్నట్లు అభిషేక్ బ్యాటు ఝులిపిస్తూ సిక్స్ కొట్టడంతో 21 పరుగులు వచ్చాయి. మరుసటి ఓవర్లో ముస్తాఫిజుర్‌కు సిక్స్‌తో స్వాగతం పలికిన అభిషేక్ మరో సిక్స్‌తో ఆకట్టుకున్నాడు. తన దూకుడును మరో స్థాయికి తీసుకెళుతూ ఈ యువ బ్యాటర్ నాలుగు ఫోర్లతో 17 పరుగులు పిండుకోవడంతో పవర్‌ప్లే ముగిసే సరికి టీమ్ఇండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. బౌలింగ్ మార్పుగా వచ్చిన రిషాద్ హుస్సేన్ బౌలింగ్‌లో తొలి బంతిని ఫోర్‌గా బాదిన గిల్ మూడో బంతికి ఔటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ప్రమోషన్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్ దూబే(2) తీవ్ర నిరాశపరిచాడు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుంటాడనుకున్న దూబే..రిషాద్ బౌలింగ్‌లో రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో అభిషేక్ 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్..అభిషేక్‌కు జతకలిశాడు. వీరిద్దరు ఇన్నింగ్స్ చక్కదిద్దుతారు అనుకున్న తరుణంలో ముస్తాఫిజుర్ 12వ ఓవర్లో అభిషేక్..రిషాద్ సూపర్ ఫీల్డింగ్‌తో రనౌట్ అయ్యాడు. ఇదే ఓవర్ ఆఖరి బంతికి సూర్య కూడా ఔట్ కావడంతో టీమ్ఇండియా 114కు నాలుగు వికెట్లు కోల్పోయింది. తిలక్‌వర్మ(5) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. శాంసన్ కంటే ముందు వచ్చిన అక్షర్‌పటేల్(10 నాటౌట్) జిడ్డుగా ఆడగా, ఉన్నంతసేపు హార్దిక్‌పాండ్యా ట్రేడ్‌మార్క్ షాట్లు ఆడటంతో టీమ్ఇండియాకు పోరాడే స్కోరు దక్కింది. తొలి 10 ఓవర్లలో 96 పరుగులు చేసిన టీమ్ఇండియా..బంగ్లా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చివరి 10 ఓవర్లలో 72 పరుగులకే పరిమితమైంది.
నిర్దేశిత లక్ష్యఛేదనలో బంగ్లాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బుమ్రా వేసిన రెండో ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన తంజిద్ హసన్ (1)..దూబేకు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పర్వేజ్‌తో కలిసి సైఫ్ హసన్..భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. వరుణ్ 5వ ఓవర్లో మూడు ఫోర్లతో 13 పరుగులతో జోరు ప్రదర్శించాడు. బౌలింగ్ మార్పుగా వచ్చిన కుల్దీప్..పర్వేజ్‌ను ఔట్ చేయడంతో రెండో వికెట్‌కు 42 పరుగుల పార్టనర్షిప్నకు బ్రేక్ పడింది. హృదయ్(7) ఊరించే బంతితో అక్షర్ పటేల్ బోల్తా కొట్టించగా, షమీమ్ హుస్సేన్(0)ను వరుణ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా..సైఫ్ దూకుడు తగ్గించలేదు. ఈ క్రమంలో పలుమార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న సైఫ్ 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్యకుమార్ సూపర్‌త్రోతో అలీ(4) రనౌట్ కాగా, బంగ్లా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. సైఫ్‌ను బుమ్రా పెవిలియన్ పంపగా, తిలక్ బౌలింగ్‌లో ముస్తాఫిజుర్(6) ఆఖరి వికెట్‌గా ఔటయ్యాడు.
భారత్: 20 ఓవర్లలో 168/6(అభిషేక్ 75, హార్దిక్ 38, రిషాద్ 2/27, తంజిమ్ 1/27), బంగ్లాదేశ్: 19.3 ఓవర్లలో 127 ఆలౌట్(సైఫ్ 69, పర్వేజ్ 21, కుల్దీప్ 3/18, బుమ్రా 2/18)