ODI World Cup 2025 : భారత్, పాకిస్థాన్ దౌత్య సంబంధాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పహల్గాంలో ఉగ్రవాదులు 26 మందిని పొట్టనబెట్టుకోవడంతో దాయాదితో ద్వైపాక్షిక మ్యాచ్లు ఆడబోమని బీసీసీఐ (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) తెగేసి చెప్పాడు. ఇదే విషయమై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC)కు లేఖ కూడా రాసింది బీసీసీఐ.
భవిష్యత్లో జరిగే ఐసీసీ ఈవెంట్లలో ఇరుజట్లు ఒకే గ్రూప్లో ఉండకుండా చూడాలని ఐసీసీకి విన్నవించింది. అయితే.. ఇదంతా సాధ్యమయ్యేనా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే.. ఈ ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్(Women’s ODI World Cup) పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది.
BCCI vice-president Rajeev Shukla has said that India will not play against Pakistan in bilateral series going forward following the Pahalgam terrorist attack on April 22.
Indian cricketers, current and former ones, condemned the attack, with Shreevats Goswami making the bold… pic.twitter.com/vBzGEYQtid
— IndiaToday (@IndiaToday) April 24, 2025
భారత గడ్డపై సెప్టెంబర్లో జరుగనున్న మహిళా వన్డే వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్థాన్ అమ్మాయిల జట్టు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో ఇండియా, పాక్ తలపడే మ్యాచ్ ఎక్కడ నిర్వహిస్తారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే.. ఈమధ్యే ముగిసిన ఛాంపియన్స ట్రోఫీ తరహాలో దాయాదిల మ్యాచ్ను తటస్థ వేదికపై నిర్వహించే అవకాశముంది. అంటే… ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక.. లేదంటే బంగ్లాదేశ్ గడ్డపై ఇండోపాక్ జట్లు తలపడేందుకు ఆస్కారముంది.
కానీ, అందుకు ఇంకా సమయం ఉన్నందున బీసీసీఐ, పాక్ క్రికెట్ బోర్డులతో ఐసీసీ మాట్లాడనుంది. ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన వేదికను ఖరారు చేయనుంది. కానీ.. మహిళల వరల్డ్ కప్ కంటే ముందే పురుషుల ఆసియా కప్(Men’s Asia Cup) ఉంది. దాంతో, ఈ టోర్నీని తటస్థ వేదికపై జరిపేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. దుబాయ్, శ్రీలంక గడ్డపై ఆసియా కప్ పోటీలు జరిగే వీలుంది. ఒకవేళ భారత్, పాకిస్థాన్లు ఫైనల్ చేరితే.. లీగ్ దశ.. సూపర్ 4తో కలిపి ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్లు ఉంటాయి.