Anganwadi | జూబ్లీహిల్స్, ఏప్రిల్ 25: హైదరాబాద్ నగరంలో అంగన్వాడీ కేంద్రాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పేద పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ అక్షరాభ్యాసానికి పరిమితమైన అంగన్వాడి కేంద్రాల్లో ఇటీవల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అట్టహాసంగా జరుపుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్న ఐసీడీఎస్ అధికారులు ఆయా కేంద్రాలలో అక్షరాభ్యాసం పూర్తి చేసుకున్న ఐదేళ్లలోపు పిల్లలకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చి ప్రాథమిక పాఠశాలల్లో అడ్మిషన్లు చేయిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయా విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో గ్రేడ్లు ప్రకటించి గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రహమత్ నగర్ డివిజన్ నేతాజీ సుభాశ్ చంద్రబోస్ నగర్ అంగన్వాడీ సెంటర్లో స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి చిన్నారులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీ సెంటర్లలో ప్లే స్కూల్ విద్యను అందిస్తున్నారని.. పేద, సామాన్య ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. లక్షలాది రూపాయలు వెచ్చించి అప్పుల పాలు కావద్దని సూచించారు.