నాగర్ కర్నూల్ / దేవరకద్ర : దేశంలో ఉగ్రవాద చర్యలకు (Terrorist ) పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉందని ముస్లిం సంఘాల నాయకులు ( Muslims Leaders ) అన్నారు. శుక్రవారం నమాజ్ అనంతరం కశ్మీర్లో ( Kashmir ) ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ నాగర్కర్నూల్ పట్టణ ముస్లిం యువకుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.
అనంతరం అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు హబీబుర్ రెహమాన్, యాకుబ్ బావజీర్, మహమ్మద్ ఖాదర్, మహ్మద్ నిజాం, మహమ్మద్ ఖాజా బాబా తదితరులు మాట్లాడారు. అకారణంగా 26 మంది అమాయకులు ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని వారన్నారు. దేశంలో ఉగ్రవాద చర్యలకు ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ లాంటి దేశాలపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని వారన్నారు.
అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఉగ్రవాదుల చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ఈ భూమిపై జీవించే హక్కు ప్రతి ఒక్కరిపై ఉందని అలాంటి హక్కులను హరించే ఉగ్రవాదులను ఉపేక్షించకూడదని పేర్కొన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడడానికి ముస్లిం యువత ముందుకు వస్తారని , మిలిటరీలో ముస్లిములకు స్థానం కల్పించి పాకిస్తాన్ తో పోరాడడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ముస్లిం సంఘాల నాయకులు, ముస్లిం యువజన సంఘాల నాయకులు, యువకులు పాల్గొన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
పహాల్గం ఉగ్ర దాడికి నిరసనగా దేవరకద్ర మండల కేంద్రంలోని జమియా మజీద్లో శుక్రవారం ముస్లిం సోదరులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాంలో పర్యటకులపై దాడిని తీవ్రంగా ఖండించారు. అమాయకులైన పర్యటకులపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మ శాంతి కలగాలని మౌనం పాటించారు. యావత్ భారత వాణి ఇలాంటి ఘటనలను ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సోదరులు సయ్యద్ గౌస్, ఎం డి ఖదీర్ పాషా, ఎండీ జమీల్, ఖాజా కుతుబుద్దిన్, ఎండీ అయూబ్, ఖాదర్ సాహెబ్ జాహీద్, ఖలిద్ తదితరులు పాల్గొన్నారు.