ముంబై : హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు తీపి కబురు! నగరంలోని ఉప్పల్‌లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మరో ధనాధన్ పోరుకు ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానున్న న్యూజిలాండ్‌తో టీమ్ఇండియా ఇక్కడ ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు గాను కివీస్ జట్టు జనవరిలో భారత్‌కు రానుంది.
ఈ మేరకు బీసీసీఐ.. హైదరాబాద్‌తో పాటు జైపూర్, మొహాలి, ఇండోర్, రాజ్‌కోట్, గువహతి, త్రివేండ్రం, నాగ్‌పూర్ వేదికలను ఖరారు చేసినట్టు సమాచారం. శనివారం జరుగబోయే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వెలువడనుంది. ఉప్పల్‌లో చివరిసారిగా భారత్.. నిరుడు అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడగా ఆ పోరులో టీమ్ఇండియా ఏకంగా పొట్టి క్రికెట్లో తమ అత్యధిక పరుగుల రికార్డు (297/6)ను నమోదుచేసిన విషయం విదితమే.