ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే పెర్త్‌పై జెండా ఎగరేసిన టీమ్ఇండియా..అడిలైడ్‌లోనూ అదే పునరావృతం చేయాలన్న పట్టుదలతో ఉంది. గులాబీ బంతితో జరిగే ఈ డే అండ్ నైట్ టెస్టులో ఆధిపత్యం ఎవరిదో తేలనుంది. క్రితంసారి ఇక్కడే 36 పరుగులకు ఆలౌటై అప్రతిష్ట మూటగట్టుకున్న టీమ్ఇండియా ఈసారి పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నది. ఆసీస్ బౌలింగ్ దాడిని దీటుగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులతో సమాయత్తమైంది. ఓపెనింగ్‌లో రాహుల్ రాక ఖరారు కాగా, కెప్టెన్ రోహిత్ మిడిల్‌కు పరిమితం కానున్నాడు. గాయపడ్డ హాజిల్‌వుడ్‌కు బదులు బోలాండ్ ఆసీస్ తుది జట్టులోకి రానున్నాడు.
IND vs AUS 2nd Test | అడిలైడ్: బీజీటీ టోర్నీలో రెండో టెస్టుకు అడిలైడ్‌లో తెరలేవనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే ఈ గులాబీ పోరు అభిమానులకు సరికొత్త అనుభూతి కల్గించనుంది. చాలా రోజుల తర్వాత డే అండ్ నైట్ టెస్టు ఆడబోతున్న టీమ్ఇండియా అందుకు తగ్గట్లు ప్రాక్టీస్‌లో చెమటోడ్చింది. రెండో టెస్టుకు ముందు పీఎం లెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఆకట్టుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్..అడిలైడ్‌లోనూ తమ ప్రతాపం చూపించేందుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. పెర్త్‌కు భిన్నంగా స్పిన్‌కు అనుకూలించే అవకాశమున్న అడిలైడ్ పిచ్ ఎవరికి సహకరిస్తుందో చూడాలి. రోహిత్‌శర్మ రాకతో టీమ్ఇండియా తుది జట్టులో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పెర్త్ టెస్టు విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమ్ఇండియా..అడిలైడ్‌లో అదే కాంబినేషన్ కొనసాగించేందుకు మొగ్గుచూపుతున్నది. పెర్త్‌లో ఆసీస్ బౌలింగ్ దాడిని తిప్పికొడుతూ యశస్వి జైస్వాల్, రాహుల్ భారత రికార్డు విజయంలో కీలకమయ్యారు. ఇప్పుడు అదే రీతిలో ఆడిలైడ్‌లోనూ రాణిస్తే మనకు తిరుగుండకపోవచ్చు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్‌శర్మ..గురువారం మీడియా భేటీలో దీనిపై స్పష్టతనిచ్చాడు. ‘జట్టు విజయం కోసం టీమ్ మేనేజ్మెంట్ సూచలనకు అనుగుణంగా జైస్వాల్, రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. నేను మిడిలార్డర్లో ఏదో ఒక స్థానంలో బ్యాటింగ్ వస్తాను.
ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఈ కాంబినేషన్‌ను కొనసాగిస్తున్నాం. జట్టు గెలుపు అవసరాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్‌లో మార్పులు చోటు చేసుకునే చాన్స్ ఉంది’ అని అన్నాడు. ఇదిలా ఉంటే దేవదత్ పడిక్కల్, దృవ్ జురెల్‌కు బదులుగా రోహిత్, శుభ్‌మన్ గిల్ రాక ఖరారైంది. ఇక స్పెషలిస్టు స్పిన్నర్‌గా ఆల్‌రౌండర్ సుందర్‌ను కొనసాగిస్తారా లేక అశ్విన్ వైపు మొగ్గుచూపుతారో చూడాలి. పేసర్ల విషయంలో ఎలాంటి మార్పు చోటు చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు. బుమ్రా, సిరాజ్, రానాకు తోడు ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌ను తుది జట్టులో చోటు నిలుపుకునే చాన్స్ ఉంది. అంతకుమించి మార్పులేమి ఉండకపోవచ్చు.
సిరీస్‌లో ఎలాగైనా పుంజుకోవాలని చూస్తున్న ఆస్ట్రేలియా అందుకు తగ్గట్లు తమకు బాగా అచ్చొచ్చిన అడిలైడ్‌లో భారత్‌పై ఆధిపత్యం కోసం చూస్తున్నది. గతంలో ఇక్కడే టీమ్ఇండియాను 36 పరుగులకు పరిమితం చేసిన ఆసీస్..మళ్లీ ఇప్పుడు అదే పునరావృతం చేయాలని చూస్తున్నది. సొంతగడ్డపై ఆడిన 12 డే అండ్ నైట్ టెస్టుల్లో కంగారూలు ఒకే ఒక ఓటమి ఎదుర్కొవడం వారి ఆధిపత్యాన్ని చాటుతున్నది. గాయపడ్డ హాజిల్‌వుడ్ స్థానలో స్కాట్ బోలాండ్ రాక ఖరారు కాగా, మిచెల్ మార్ష్ బౌలింగ్‌పై సందిగ్ధత నెలకొన్నది. లబుషేన్, స్మిత్ పేలవ ఫామ్ జట్టును కలవరపెడుతున్నది. ఓపెనర్ మెక్‌స్వీని నిలదొక్కుకోవడంపై ఆసీస్ శుభారంభం ఆధారపడి ఉంది.
1 ఈ ఏడాది టెస్టుల్లో 50 వికెట్ల మార్క్ అందుకోవడానికి బుమ్రా వికెట్ దూరంలో ఉన్నాడు.
భారత్: జైస్వాల్, రాహుల్, గిల్, కోహ్లీ, రోహిత్(కెప్టెన్), పంత్, సుందర్, నితీశ్‌కుమార్, రానా, బుమ్రా, సిరాజ్.
ఆస్ట్రేలియా: ఖవాజ, మెక్‌స్వీని, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, క్యారీ, కమిన్స్(కెప్టెన్), స్టార్క్, లియాన్, బోలాండ్