Asia Cup 2023 : ఎమర్జింగ్ ఆసియా కప్(ACC Mens Emerging Asia Cup)లో దుమ్మురేపుతున్న భారత ఏ జట్టు(India A ) ఫైనల్లో అడుగుపెట్టింది. ఈరోజు జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ఏ(Bangladesh A) జట్టుపై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 51 పరుగుల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ యశ్ ధుల్(66), నిషాంత్ సింధు (5 వికెట్లు)జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దాంతో, దాయాది పాకిస్థాన్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఆదివారం ప్రేమదాస స్టేడియం(R.Premadasa Stadium)లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఏ జట్టు 211 పరుగులకు ఆలౌటయ్యింది. కెప్టెన్ యశ్ ధుల్(66) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. అభిషేక్ శర్మ(34), సాయి సుదర్శన్(21) తప్ప మిగతావాళ్లంతా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్, తాంజిమ్ హసన్ షకీబ్, రకీబుల్ హసన్ రెండేసి వికెట్లు తీశారు.
నిషాంత్ సింధు
ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాను ఆఫ్ స్పిన్నర్ నిషాంత్ సింధు(Nishant Sindhu) దెబ్బకొట్టాడు. 5 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మానవ్ సుతార్ 3 వికెట్లతో సహకారం అందించాడు. దాంతో, బంగ్లా 34.2 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా జట్టులో ఓపెనర్ తంజిద్ హసన్(51) ఒక్కడే ఫిఫ్టీతో రాణించాడు.