విశాఖపట్నం : శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టీ20 పోరులో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో లంకపై ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. స్వదేశం వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టైటిల్ గెలిచిన తర్వాత తొలిసారి బరిలోకి దిగిన భారత్ సమష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో లంకను స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన భారత్ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. లంక నిర్దేశించిన 122 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 14.4 ఓవర్లలో 122/2 స్కోరు చేసింది. యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్(44 బంతుల్లో 69 నాటౌట్, 10ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో కదంతొక్కింది. రోడ్రిగ్స్‌కు తోడు ఓపెనర్ స్మృతి మందన(25) ఆకట్టుకుంది. కావ్య కవింది(1/20), ఇనోక రణవీర(1/17) ఒక్కో వికెట్ తీశారు. తొలుత లంక నిర్ణీత 20 ఓవర్లలో 121/6 స్కోరుకు పరిమితమైంది. ఓపెనర్ విశ్మి గుణరత్నె(39) ఆట్టుకోగా, మిగతావారు తేలిపోయారు. దీప్తిశర్మ(1/20), క్రాంతిగౌడ్(1/23), శ్రీచరణి(1/30) రాణించారు. అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమైన జెమీమా రోడ్రిగ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 పోరు ఈనెల 23న ఇక్కడే జరుగనుంది.
ఆది నుంచే కట్టడి : టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ మరో ఆలోచన లేకుండా లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ భారత బౌలర్లు లంకను ఆదిలోనే దెబ్బతీశారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో కెప్టెన్ చమరీ ఆటపట్టు(15)ను క్రాంతిగౌడ్ క్లీన్‌బౌల్డ్ చేయగా, లంక 18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హాసిని పెరెరా (20).. విశ్మికి జత కలిసింది. ఈ ఇద్దరు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే బౌలింగ్ మార్పుగా వచ్చిన దీప్తిశర్మ..హాసినిని ఔట్ చేయడంతో రెండో వికెట్‌కు 31 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. హర్శిత సమరవిక్రమ (21), హాసిని..భారత బౌలర్లను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశారు. 16 పరుగుల తేడాతో వీరిద్దరు ఔట్ కావడంతో లంక కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. నీలాక్షిక సిల్వా(8), కవిశ్క దిల్హారి(6) రనౌట్లుగా వెనుదిరుగడంతో లంక స్వల్ప స్కోరుకు పరిమితమైంది.
జెమీమా దూకుడు : లక్ష్యఛేదనలో భారత్‌కు మెరుగైన శుభారంభం దక్కలేదు. డాషింగ్ ఓపెనర్ షెఫాలీవర్మ(9) సింగిల్ డిజిట్‌కే వైదొలుగడంతో ఇన్నింగ్స్ బాధ్యతను మందన, జెమీమా రోడ్రిగ్స్ భుజానెత్తుకున్నారు. వీరిద్దరు లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. మెగాటోర్నీ ఫామ్‌ను కొనసాగిస్తూ జెమీమా లంక బౌలర్లపై విరుచుకుపడింది. పవర్‌ప్లేను అనుకూలంగా మలుచుకుంటూ బౌండరీలతో చెలరేగింది. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌లో రణవీర బౌలింగ్‌లో మందన ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 54 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌నకు బ్రేక్ పడింది. మందన ఔటైనా జెమీమా తన దూకుడు తగ్గించలేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్(15 నాటౌట్)తో కలిసి జెమీమా..జట్టును లక్ష్యం వైపు సాఫీగా నడిపించింది. మంచు ప్రభావంతో లంక బౌలర్లు తేలిపోవడం భారత బ్యాటర్లకు సులువైంది.

1 అంతర్జాతీయ టీ20ల్లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా మందన నిలిచింది. ఓవరాల్‌గా సుజీ బేట్స్ (4716) టాప్‌లో ఉంది.
శ్రీలంక: 20 ఓవర్లలో 121/6(విశ్మి 39, హర్శిత 21, దీప్తిశర్మ 1/20, కాంత్రిగౌడ్ 1/23),
భారత్: 14.4 ఓవర్లలో 122/2(జెమీమా 69 నాటౌట్, మందన 25, రణవీర 1/17, కావ్య 1/20)